విజయ డెయిరీ మేనేజర్​ ఇంట్లో రూ.24 లక్షలు చోరీ

విజయ డెయిరీ మేనేజర్​ ఇంట్లో రూ.24 లక్షలు చోరీ
  • డబ్బు చోరీపై  ఉన్నతాధికారుల విచారణ

మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని విజయ డెయిరీ ​ మేనేజర్ రజిత అద్దెకు ఉంటున్న ఇంట్లో నుంచి గత  నెలలో రూ.24 లక్షలు చోరీ కాగా డెయిరీలో అక్రమాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బుధవారం హెడ్డాఫీసు నుంచి డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ సురేశ్, అకౌంట్స్ ఆఫీసర్ లావణ్య ఆఫీసులో రికార్డులు తనిఖీ చేశారు. పాల విక్రయాల ద్వారా ఎంత డబ్బు సమకూరింది.. రైతులకు ఎంత చెల్లించారు.. తదితర వివరాలను పరిశీలించారు. 

గ్రామాల నుంచి డెయిరీకి ప్రతి రోజు వచ్చే పాల లెక్కల వివరాలు రికార్డులో నమోదవుతాయని మెదక్ డిప్యూటీ మేనేజర్ గోపాల్ సింగ్ తెలిపారు. కాగా మేనేజర్ రజిత మాట్లాడుతూ.. తన పెళ్లి అవసరాల కోసం తెచ్చుకున్న  రూ. 24 లక్షల డబ్బులను డెయిరీలో టెంపరరీగా పనిచేసే ప్రసాద్ దొంగిలించాడని తెలిపింది. ప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడగా.. దొంగతనం ఒప్పుకున్నాడని ఈ నెల 22న డబ్బులు చెల్లిస్తాడని చెప్పడంతో పోలీసులకు ఈ విషయం చెప్పలేదని ఆమె పేర్కొంది. మొత్తం మీద విజయ డెయిరీ లో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.