- సిటీలో వాటర్‌బోర్డు లెక్కల్లోకి రాని 180 ఎంజీడీలు
హైదరాబాద్, వెలుగు: సిటీలో వాటర్ బోర్డు సప్లయ్ చేసే నీటిలో రోజూ180 ఎంజీడీ (మిలియన్గ్యాలన్పర్డే)లు వృథా అవుతోంది. మొత్తం సప్లయ్ అయ్యే వాటర్‌లో ఇది 40 శాతంగా ఉంది. ఇదే నీటితో సుమారు 5–7 లక్షల మంది అవసరాలు తీర్చొచ్చు. వృథా నీటి నియంత్రణలో వాటర్‌బోర్డు నిర్లక్ష్యంగా ఉంటోంది. ప్రతి వెయ్యి కిలో లీటర్ల నీటి శుద్ధికి వాటర్‌బోర్డు రూ. 45 ఖర్చు చేస్తోండగా, వృథా నీటిపై అధికారులు ఏ మాత్రం ఫోకస్ చేయడంలేదు. జనాల నిర్లక్ష్యం, పైపు లైన్ల నిర్వహణ లోపం, అక్రమ నల్లా కనెక్షన్లతోనే వృథా అవుతుం డగా, రూ. కోట్లలో నష్టపోతుంది. వాటర్‌బోర్డు ప్రతిరోజూ కృష్ణా, గోదావరి నదుల నుంచి 475 ఎంజీడీల నీటిని తీసుకొచ్చి శుద్ధి చేస్తోంది. దాదాపు10 లక్షల నల్లా కనెక్షన్ల ద్వారా ఇంటింటికి సప్లయ్ చేస్తోంది.
సనత్‌నగర్‌లోని నల్లా కనెక్షన్లపై సర్వేలో..
రోజూ సప్లయ్ అయ్యే తాగునీటిలో ఎక్కువగా డొమెస్టిక్ వాడకం ద్వారానే 31 శాతం (6 ఎంజీడీలు) వృథాగా పోతోంది. దీన్ని నియంత్రించి వాడుకుంటే రాజేంద్రనగర్ ప్రాంతానికి ఫుల్‌గా సప్లయ్ చేయొచ్చు. సిటీలో ఇప్పటికీ చాలా ఏరియాల్లో తాగునీటి ఇబ్బందులు వస్తుండగా, వృథా నీటి నియంత్రణకు వాటర్ బోర్డు చర్యలు తీసుకోవడం లేదు. కొంతకాలం కిందట సనత్ నగర్ సెగ్మెంట్లో 30 వేల నల్లా కనెక్షన్లపై సర్వే చేయగా, ఇందులో 6.26 కోట్ల లీటర్ల నీరు సప్లయ్ అవుతుండగా, వాడకంలోకి వచ్చిన నీటి పరిమాణం కేవలం 3.82 కోట్ల లీటర్లుగా తేలింది. దీంతో వాటర్‌బోర్డు ప్రతి రోజు రూ. 9 లక్షల ఆదాయం కోల్పోతోందని వెల్లడైంది.
లీకేజీలే ఎక్కువగా..
సనత్ నగర్ సెగ్మెంట్లో చేసిన సర్వేలో ప్రధానంగా నీటి వృథానే అంచనా వేశారు. ఇందులోమనుషుల పొరపాట్లే ఎక్కువ ఉండగా, ఇండ్ల నుంచి రోడ్డు మీదకు పొంగడం, నల్లాలకు ఆన్ ఆఫ్ కాక్ లేకపోవడం, మెయిన్ పైపులకు మోటార్లను బిగించి నీటిని తోడేయడం, నల్లా మీటర్ ఛాంబర్లు, మెయిన్ పైపు లైన్లీకేజీల కారణాలుగా కనిపించాయి. ఇలాంటి వాటిపై నిర్లక్ష్యంగా ఉంటున్న అధికారులు వినియోగదారులకు అవగాహన కల్పించడంలో ఫెయిల్అవడమే కాకుండా తాగునీటి వృథాను సమర్థంగా నియంత్రించడంలో జాగ్రత్తలు తీసుకోవట్లేదు.
సిటీలో ప్రతిరోజు మొత్తం వాటర్ సప్లై: 475 ఎంజీడీలు
వృధా నీటి పరిమాణం: 180 ఎంజీడీలు
మొత్తం నీటిలో 40 శాతం
రోజువారీ వృధా నీటి విలువ రూ.2.05 కోట్లు