వికారాబాద్, వెలుగు: మండలంలోని పులుమద్ది గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే రూ. 25 వేల జరిమానా విధిస్తామని గ్రామంలో చాటింపు వేశారు. గ్రామంలో గత 15 సంవత్సరాలుగా మద్యం విక్రయించకుండా గ్రామస్తులు తీర్మానించి, అమలు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి గుట్టుచప్పడు మద్యం విక్రయించగా మద్యం సేవించిన వ్యక్తి తన పొలంలో ఉన్న సొప్ప గడ్డి కుప్పకు నిప్పంటించే బదులుగా పక్క పొలంలోని సొప్పకు నిప్పంటించాడు.
ఈ విషయమై గ్రామస్తులు సదరు వ్యక్తిని నిలదీయగా ఫలానా మద్యం తాగడం వల్ల మత్తులో సొప్ప నిప్పంటించినట్లు ముందు ఒప్పుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని గ్రామ పెద్దలు పిలిచించి రూ. 5 వేల జరిమానా విధించి మరోసారి మద్యం విక్రయించవద్దని మందలించారు. మళ్లీ గ్రామంలో ఎవరైనా అక్రమంగా గుట్టుచప్పడు కాకుండా మద్యం విక్రయిస్తే 25 వేల రూపాయల జరిమానా విధిస్తామని రగామ పెద్దలు సోమవారం రాత్రి చాటింపు వేయించారు.