- ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష రూ.25 లక్షలు వసూలు
- సైబరాబాద్పోలీసులను ఆశ్రయించిన 80 మంది బాధితులు
గచ్చిబౌలి, వెలుగు: చిట్టీల పేరుతో ఓ వ్యక్తి 80 మందిని మోసం చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.25లక్షలు దాకా వసూలు చేసి బిచానా సర్దేశాడు. బాధితుల ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. చందా నగర్ కి చెందిన సూర్యప్రతాప్ రెడ్డి కూకట్పల్లి, పఠాన్‌చెరు, మియాపూర్ ఏరియాల్లో 14 ఏండ్లుగా నెలవారీ చిట్టీల బిజినెస్చేస్తున్నాడు.
అందరితో నమ్మకంగా ఉంటుండడంతో ఒక్కొక్కరు రూ.లక్ష నుంచి రూ.25లక్షల వరకు చిట్టీలు కట్టారు. అయితే చిట్టీ పాడుకున్నవారికి పైసలు ఇవ్వకుండా సూర్యప్రతాప్ రెడ్డి దాటవేస్తూ వస్తున్నాడు. కొన్నిరోజులుగా ఇంటికి తాళం వేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారం సూర్యప్రతాప్ రెడ్డిని కర్మన్ ఘాట్ వద్ద అరెస్ట్ చేశారు. చిట్టీల బిజినెస్పేరుతో సూర్యప్రతాప్‌రెడ్డి 80 మంది నుంచి రూ.2.79కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు.