
- రూ. 29.12 కోట్లు మంజూరు
- స్థల పరిశీలన చేస్తున్న అధికారులు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రభుత్వం ఇంజినీరింగ్కాలేజ్ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ఇవ్వడంతో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పొన్నం ప్రభాకర్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి తనదైన రీతిలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇటీవల పెద్దపల్లి సభలో హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కాలేజ్ఏర్పాటు గురించి సీఎం రేవంత్ రెడ్డికి వివరించి మంజూరయ్యేలా చేశారు.
శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసే ఈ కాలేజీలో 2025–26 విద్యా సంవత్సరానికి బీటెక్సీఎస్ఈ, ఏఐ, ఐటీ, ఈసీఈ బ్రాంచ్‌లను ప్రారంభించనున్నారు. ఒక్కో బ్రాంచ్‌లో 60 మంది స్టూడెంట్స్‌కు అడ్మిషన్లు కల్పిస్తారు. ఇంజినీరింగ్ కాలేజ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.44.12 కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.29.12 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. మిగిలిన రూ.15 కోట్లను తర్వాత మంజూరు చేయనుంది.
కాలేజీ ఏర్పాటుకు స్థల పరిశీలన
హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు 20 ఎకరాల భూమి అవసరమవుతుండడంతో అధికారులు పట్టణ సమీపంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల కలెక్టర్ మనుచౌదరి, శాతవాహన వర్సిటీ వైస్ చాన్స్ లర్ ఉమేశ్ కుమార్ తో కలిసి ఉమ్మాపూర్ గ్రామ శివారులోని మహాసముద్రం గండి సమీపంలో గల ప్రభుత్వ స్థలాన్ని, జిల్లెలగడ్డలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్పక్కన గల స్థలాన్ని, పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలోని స్థలాన్ని పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తుండడంతో తాత్కాలిక భవనంలో తరగతులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
స్థానికుల హర్షాతిరేకాలు
హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంతో స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మల్లెచెట్టు చౌరస్తా వద్ద పటాకులు కాలుస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు. హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటోకు స్టూడెంట్స్క్షీరాభిషేకం నిర్వహించారు. ఎన్ఎస్ యూఐ నేతలు స్టూడెంట్స్‌కు స్వీట్లు పంపిణీ చేసి సంతోషాన్ని వ్యక్తంచేశారు. హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను పలువురు అధికారులు, పార్టీ నేతలు కలసి అభినందనలు తెలిపారు. హుస్నాబాద్ కు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు కావడంపై మంత్రి పొన్నం హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
హుస్నాబాద్ పై పొన్నం మార్క్
హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చెపట్టిన 15 నెలల కాలంలో పొన్నం ప్రభాకర్ తనదైన మార్క్ ను చూపెడుతున్నారు. ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ఏర్పాటుకు హామీ ఇవ్వడమే కాకుండా ఆ దిశగా కసరత్తును చేస్తూనే ఎవరూ ఊహించని విధంగా ఇంజనీరింగ్ కాలేజ్ఏర్పాటులో విజయం సాధించారు. 15 నెలల కాలంలో గౌరవెల్లి కాల్వల నిర్మాణం కోసం రూ. 412 కోట్లు మంజూరు చేయించి ప్రగతిని స్పీడప్చేశారు.
హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రిని 150 పడకలకు అప్ గ్రేడ్ చేయించడమే కాకుండా రూ.72 కోట్లతో కొత్త పల్లి నుంచి హుస్నాబాద్ వరకు డబుల్ రోడ్డు పనులను ప్రారంభించారు. పట్టణంలో ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న ఎల్లమ్మ చెరువు సుందరీకరణకు 32 ఎస్టిమేషన్లు తయారు చేయడమే కాకుండా రూ.18 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి.