
తిరుమల తిరుపతి దేవస్థానానికి(TTD) , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ3 కోట్ల జరిమానా విధించింది. భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీ విషయంలో ది ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్( FCRA) నిబంధనలు ఉల్లింఘించినందుకు ఫైన్ విధించిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అయితే ఈ మొత్తాన్ని రెండు విడతల్లో చెల్లించినట్లు చెప్పారు. టీటీడీకి ఉన్న ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ 2108 తోనే ముగిసిందని.. దీన్ని ఇప్పటి వరకు రెన్యువల్ చేయకపోవడంతోనే ఈ ప్రాబ్లమ్ వచ్చిందన్నారు. లైసెన్స్ ను రెన్యూవల్ చేయాలని ఆర్బీఐని కోరినట్లు తెలిపారు. హుండీ కానుకల ద్వారా రూ.30 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ వచ్చిందని వెల్లడించారు.
అలిపిరి మెట్ల మార్గంలో దర్శనం టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు అలిపిరి మార్గంలో 10 వేల టోకెన్లు, శ్రీవారిమెట్టు మార్గంలో 5 వేల దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తామని వెల్లడించింది. ఆ తరువాత భక్తుల సూచనలు,సలహాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తామని టీటీడీ ప్రకటించింది.
ఏప్రిల్ 15 నుండి జులై 15వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, కావున సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీ, బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్ సేవలు, రూ.300 దర్శన టికెట్లు చాలా వరకు తగ్గిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయ మాడ వీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో భక్తులకు కాళ్లు కాలకుండా కూల్ పెయింట్ వేస్తామని చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా గదుల కేటాయింపులో పారదర్శకతను పెంచడం జరిగిందన్నారు.