- మనీలాండర్‌రింగ్ కేసు లో ఇరుక్కున్నారని రూ.30 లక్షలు దోపిడీ
- పార్ట్‌టైం జాబ్పేరుతో మరో యువతి నుంచి 8లక్షలు లాగిన చీటర్స్
బషీర్ బాగ్, వెలుగు : మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉందంటూ ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం... నగరానికి చెందిన 61 ఏళ్ల వృద్ధురాలికి సైబర్ చీటర్స్ ఫోన్ చేశారు. రూ. 2 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉందని చెప్పారు. ఈ విషయంపై కేసు నమోదైందని, సీబీఐ , ఈడీ రైడ్స్ జరిగాయని భయపెట్టారు.
కేసులో నేరస్తునిగా ఉన్న వ్యక్తి నుంచి 10 శాతం కమీషన్ మీ బ్యాంక్ లో జమ అయ్యాయని తెలిపారు. ఈడీ అధికారులు గుర్తించారని , కేసు నమోదైందని ఫేక్ అరెస్ట్ వారెంట్ ను పంపించారు. తమకు సహకరిస్తే ఈ కేసు నుంచి బయట పడొచ్చని నమ్మించారు. ఆమె అకౌంట్లో ఉన్న డబ్బును పంపించాలని, విచారణ తర్వాత రెండు రోజుల్లో తిరిగి పంపిస్తామని చెప్పారు. దీంతో వృద్ధురాలి రూ 30 లక్షల 96 వేలను వారికి పంపింది. రెండు రోజుల తరువాత మోసపోయనని గుర్తించిన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరో కేసులో ..
పార్ట్ టైం జాబ్ పేరిట 23 ఏళ్ల యువతిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన బాధిత యువతి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. సదరు యువతికి వాట్సాప్ లో పార్ట్ టైం జాబ్ ఉందని , స్కామర్లు మెసేజ్ చేశారు.
యూట్యూబ్ ఛానెల్స్ లను సబ్‌స్ర్కైబ్ చేసి, తమకు స్క్రీన్ షాట్స్ పంపిస్తే డబ్బులు చెల్లిస్తామన్నారు. కొద్దీ రోజులు డబ్బులు చెల్లించడంతో బాధితురాలికి నమ్మకం కలిగింది. ఇంకా పెద్ద మొత్తంలో లాభాలు కావాలంటే... ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేయాలని ఓ లింక్ ను పంపించారు. అది నిజమని నమ్మిన యువతి తన వద్ద ఉన్న డబ్బులను పలు దఫాలుగా ఇన్వెస్ట్ చేసింది. ఇన్వెస్ట్మెంట్ డబ్బులకు లాభాలు వచ్చినట్లు స్కామార్లు వెబ్ సైట్ లో చూపించారు.
కొద్ది రోజులకు డబ్బులను విత్ డ్రా చేయడానికి బాధితురాలు యత్నించగా.. డబ్బులు రాలేవు. దీంతో యువతి స్కామర్లను సంప్రదించగా వారు మరికొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని ఒత్తిడి చేశారు. ఇదంతా స్కామ్ గా గ్రహించిన బాధితురాలు మొత్తం రూ 8 లక్షల 99 వేలు మోసపోయినట్లు గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.