హైదరాబాద్, వెలుగు: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంటి దగ్గరకే పండ్లు తెచ్చిచ్చే కొత్త కార్యక్రమానికి మార్కెటింగ్ శాఖ శ్రీకారం చుట్టింది. కిలోన్నర మామిడి, 3 కిలోల బొప్పాయి, కిలో సపోట, రెండున్నర కిలోల బత్తాయి, 4 కిలోల వాటర్ మెలన్, 12 నిమ్మకాయల ప్యాకేజీని రూ. 300కే అందిస్తోంది.ఆదివారమే ఈ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేసింది. 30 ప్యాకెట్లకు మించి ఆర్డరిస్తే ఇంటి వద్దకే సరఫరా చేస్తామని చెప్పింది. ఆర్డర్ల కోసం 7330733212 కాల్ సెంటర్‌కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఫోన్ చేయాలంది. పంపిణీ కోసం నేరుగా వ్యవసాయ క్షేత్రాల వద్ద నుంచే పండ్లను సేకరిస్తోంది. ఇప్పటికే 30 టన్నుల బత్తాయి, 10 టన్నుల మామిడి, 6 టన్నుల సపోట, 8 టన్నుల వాటర్ మిలన్, 2 టన్నుల నిమ్మ, 10 టన్నుల బొప్పాయిని సిద్ధం చేసుకుంది. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు ఆధ్వర్యంలో ప్యాకేజింగ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉత్తరాదికి బత్తాయి సరఫరా నిలిచిపోవడం, మామిడి ఎగుమతులు లేకపోవడం, ప్రజలు బయటకు రాక స్థానికంగా అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పటికే మొబైల్ రైతుబజార్ల ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 550 కేంద్రాల్లో రోజూ పండ్లు, కూరగాయలు అమ్ముతున్నారు. శుక్ర, శనివారాల్లో 3,500 పైగా ప్రాంతాల్లో పండ్లు సరఫరా చేస్తున్నారు.
For More News..