- స్టాక్‌మార్కెట్ పేరుతో మోసాలు
- దుబాయ్ నుంచి ఆన్ లైన్లో లావాదేవీలు
- ఇద్దరు సైబర్ క్రైమ్ నిందితుల అరెస్ట్
- హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: మనకు తెలియకుండానే మన పేరిట బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.. అందులో ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి. బయటి నుంచి డబ్బులు వచ్చి ఖాతాలో పడతాయి.. ఆ తర్వాత క్యాష్ విత్ డ్రా కూడా వెంటవెంటనే జరిగిపోతూ ఉంటుంది. మనకు సంబంధం లేకుండా ఆ ఖాతా నుంచి లక్షల రూపాయలు చేతులు మారతాయి. ఇలా సరికొత్త స్టైల్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయి.
ఈ తరహాలో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1.4 కోట్ల నగదు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.
‘హైదరాబాద్ కు చెందిన బాధితురాలు తాను 3 కోట్ల 16 లక్షలు నష్టపోయాయని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దర్యాప్తు ప్రారంభించి నిందితుడు రోనక్తన్నాను గోవాలో అదుపులోకి తీసుకున్నం. ఈ స్కామ్ అంతా దుబాయ్ నుంచి జరిగినట్లుగా అతను ఒప్పుకున్నడు. నిందితుడి బ్యాంక్ అకౌంట్ లో రూ. 20 లక్షలు ఫ్రీజ్ చేశాం. అతడికి సహకరించిన మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చాం. ఈ కేసులో నిందితుడు ఇతరులకు చెందిన 95 బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నాడని గుర్తించాం’ అని సీపీ తెలిపారు.
తక్కువ ఇన్వెస్ట్‌తో అధిక లాభాలు
డఫాబెట్ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి మోసం చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి డఫాబెట్‌లో రూ. 70లక్షలు పెట్టి ఆన్‌లైన్ గేమ్ ఆడారని.. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారని సీపీ తెలిపారు. సింగపూర్, హాంకాంగ్ నుంచి నిందితులు ఫోన్లు చేస్తూ.. భారీగా లాభాలంటూ నమ్మించి మోసాలకు దిగుతారన్నారని చెప్పారు.
హర్యానాకు చెందిన హితేశ్ గోయల్ మోసాలు చేశాడని.. నిందితున్ని ఢిల్లీలో అరెస్టు చేశామని తెలిపారు . నిందితుడి నుంచి రూ.1.40 కోట్ల నగదు సీజ్ చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో నిందుతులు కనెక్ట్ అవుతారని పాస్ వర్డ్స్, ఓటీపీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.