గచ్చిబౌలి, వెలుగు:అమెరికాలో కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో యూజీ సీటు ఇప్పిస్తామని రూ.3.25 కోట్లు వసూలు చేసి మోసం చేసిన భార్యాభర్తలను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు అరెస్టు చేశారు. మాదాపూర్‌లో నివాసం ఉంటున్న సంజీవ్ కుమార్ వ్యాపారి. ఇదే అపార్ట్మెంటులో నివాసం ఉండే పాలడుగు రఘురాం, సునీత భార్యభర్తలు. సంజీవ్ కుమార్ కుమారుడికి అమెరికాలోని కాలిఫోర్నియాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తామని సంజీవ్ ను రఘురాం, సునీత నమ్మించారు.
యూనివర్సిటీ పేరుతో ఫేక్ అడ్మిషన్ డాక్యుమెంట్ సృష్టించి సంజీవ్ వద్ద రూ.3.25 కోట్లు వసూలు చేశారు. అమెరికాలోని వైట్‌హౌస్‌లో జాబ్ చేసే సుమంత్ అనే వ్యక్తి తెలుసని, అతని ద్వారా అడ్మిషన్ ఇప్పిస్తామని నమ్మించారు. రఘురాం మరో ఫోన్ నంబర్‌తో సుమంత్ లాగా సంజీవ్ కు వాట్సాప్‌లో మెసేజీలు పంపాడు. కొద్ది రోజులకు రఘురాం, సునీత తాము అడ్మిషన్ ప్రాసెస్ చేయడానికి సుమంత్‌ను కలవడానికి వెళ్తున్నామని సంజీవ్‌కు చెప్పి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి ఇద్దరూ మైసూరు వెళి మూడు రోజులు గడిపి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వారు అసలు అమెరికాకు వెళ్లలేదని బాధితుడు గుర్తించాడు. అడ్మిషన్ పేరుతో మోసం చేసినట్లు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశాడు.