
- 684 పనులకు రూ. 32.93 కోట్లు మంజూరు
- పెండింగ్లోనే 614 పనులు
- ప్రారంభానికి నోచుకోని సగం పనులు
- మార్చి 31 లోగా పూర్తి చేయకుంటే నిధులు వెనక్కి
ఆదిలాబాద్, వెలుగు: ఉపాధి హమీ పథకం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నారు. రెండు నెలల క్రితమే పనుల ప్రొసీడింగ్స్ వెలువడగా.. ప్రారంభించడంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. బిల్లులు రావనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో చేపట్టిన పనులు సైతం నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్జిల్లాలో ఇప్పటివరకు కేవలం 70 పనులు మాత్రమే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ పనులు చేపట్టేందుకు మార్చి 31 డెడ్లైన్కాగా.. అప్పట్లోగా పనులు చేపట్టకపోతే నిధులు వెనక్కి వెల్లిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో చేపట్టిన పనులకు ఇంకా 25 రోజులు మాత్రమే గడువుండగా.. 80 శాతం పనులు జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
రూ. 32.93 కోట్లు మంజూరు
ఉపాధి హామీ పథకం కింద ఏడాదంతా లేబర్ వేజ్ కంపోనెంట్ కింద 60 శాతం, మెటీరియల్ కంపోనెంట్ కోసం 40 శాతం నిధులు ఖర్చు చేస్తారు. ఆర్థిక సంవత్సరం చివరలో ఈ పనులు చేపడుతుంటారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 32.93 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో జిల్లా వ్యాప్తంగా 684 పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనుల్లో సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు, ప్రభుత్వ స్కూళ్లలో పలు రకాల పనులు చేపట్టాలి. ఈ నిధులతో ఎక్కువగా సీసీ రోడ్ల నిర్మాణాలే చేపడుతున్నారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.4.50 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. మార్చి 31లోగా కేటాయించిన రూ.32.93 కోట్లతో పనులు పూర్తిచేసి ఎంబీసీలో నమోదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే చేసిన పనులకు బిల్లులు వస్తాయి. అయితే చాలా గ్రామాల్లో ఇంకా పనులే ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు కేవలం 70 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 614 పనులు పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. సగం పనులు ప్రారంభమే కాలేదు. ఈ నేపథ్యంలో గడువులోగా పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు.
బిల్లులు రావని ముందుకు రావడం లేదు
గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలను చాలా వరకు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, లీడర్లలే చేపడుతుంటారు. రూ.2 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు అంచనా వ్యయాన్ని పనులు కేటాయిస్తారు. అయితే చేసిన పనులకు సమయానికి బిల్లులు రావనే ఉద్దేశంతో చాలా గ్రామాల్లో పనులు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అందుకే నిధులు మంజూరైనప్పటికీ జిల్లాలో సగం పనులు ఇంకా ప్రారంభం కావడం లేదు.
అధికారులు మాత్రం గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరో 24 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో పనులు పూర్తి చేస్తారో లేదోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మార్చి చివరి వారంలో హడావుడిగా పనులు చేపట్టడంతో కొన్ని చోట్ల నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. ఈ ఏడాదైనా నాణ్యతా ప్రమాణాలపై అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
గడువులోగా పనులు పూర్తి చేస్తాం..
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 684 పనుల కోసం రూ. 32.93 కోట్లు మంజూరయ్యాయి. పనులు త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించాం. - శివరాం, ఈఈ, పంచాయతీ రాజ్