సింగరేణి బాధితులకు రూ. 40 లక్షలు.. ఒక జాబ్

మృతుల ఫ్యామిలీలకు రూ. 40 లక్షలు.. ఔట్​సోర్సింగ్ ​జాబ్

గోదావరిఖని, వెలుగు:  సింగరేణి ఆర్జీ 3 ఏరియా ఓసీపీ 1వ ప్రాజెక్టులో మంగళవారం ఉదయం జరిగిన పేలుడులో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబీకులకు  రూ. 40  లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ఔట్​ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. ప్రమాదం మంగళవారం ఉదయం 10.30 గంటలకు జరగగా దాదాపు 31 గంటలపాటు పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం పరిహారంతో పాటు ఉద్యోగం ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం, ప్రైవేట్​కాంట్రాక్టు సంస్థ ఒప్పుకుంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం, సింగరేణి లో పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని మంగళవారం సాయంత్రం నుంచి వివిధ కార్మిక సంఘాలు యాజమాన్యంతో చర్చలు జరిపాయి. చర్చలు విఫలం కావడంతో రాత్రి రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బుధవారం ఉదయం కూడా సింగరేణి జీఎం కార్యాలయంలో, సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వేర్వేరుగా చర్చలు జరిగాయి. సాయంత్రం సింగరేణి డైరెక్టర్(పా, ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ సమక్షంలో  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ,  గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షులు బి.వెంకట్ రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, జాతీయ కార్మిక సంఘాలైన బీఎంఎస్ అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య, ఏఐటీయూసీ అధ్యక్షులు గట్టయ్య, ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, సీఐటీయూ అధ్యక్షులు టి.రాజారెడ్డి, సింగరేణి ఆర్జీ 1 జీఎం కె.నారాయణ, ఇతర కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు జరిపిన చర్చల్లో మృతుల కుటుంబాలకు రూ. 40 లక్షల చొప్పున పరిహారం, గాయపడినవారికి మెరుగైన చికిత్సతో పాటు వారికి చట్టప్రకారం పరిహారాన్ని అందించడానికి అంగీకరించారు. అనంతరం మార్చురీలో ఉన్న మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ బుధవారం సింగరేణి ఏరియా ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబీకులను పరామర్శించారు. విశాఖపట్నంలో గ్యాస్ ​ప్రమాద దుర్ఘటనలో చనిపోయినవారికి ఏపీ సీఎం జగన్ కోటి రూపాయల పరిహారం అందచేస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం స్పందించకపోవడం సరైంది కాదన్నారు. ఈ ఘటనపై వెంటనే కేసీఆర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఉపనేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఘటనపై డీఎంఎస్ విచారణ

సింగరేణి ప్రమాద ఘటనపై డైరెక్టర్ ఆఫ్​మైన్స్ సేఫ్టీ (డీఎంఎస్, హైదరాబాద్ ) శ్యాం మిశ్రా బుధవారం విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు కాంట్రాక్టు కార్మికులతో మాట్లాడి ప్రమాద జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సింగరేణి డైరెక్టర్ ఎస్. చంద్రశేఖర్ మృతుల కుటుంబాలను పరామర్శించారు.

ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదు: కెంగర్ల మల్లయ్య
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై యాజమాన్యం చూపుతున్న శ్రద్ధ కార్మికుల సంక్షేమంపై లేదని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య విమర్శించారు. సింగరేణి ఓసీపీ 1లో జరిగిన ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమన్నా రు. సింగరేణి సంస్థ కాంట్రాక్టు కంపెనీ కాదని, మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపైన ఉందన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే స్పందించాల్సిన యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేసి మృతుల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

For More News..

డేంజర్‌లో డాక్టర్లు..

డిగ్రీ, ఆపై కోర్సుల్లో.. ఫస్టియర్‌‌కు నో సెమిస్టర్!