గచ్చిబౌలిలో బొమ్మ తుపాకీతో బెదిరించి రూ.4.5లక్షలు చోరీ

గచ్చిబౌలిలో బొమ్మ తుపాకీతో బెదిరించి రూ.4.5లక్షలు చోరీ

గచ్చిబౌలి, వెలుగు : తనను ఉద్యోగంలో నుంచి తీసివేశారనే కోపంతో ఇద్దరు యువకులు బార్ లో బొమ్మ పిస్టల్​ తో బెదిరించి,  సెక్యూరిటీ గార్డును బంధించి  రూ. 4.50  నగదు,  ఎలక్ట్రానిక్ వస్తువులను చోరీ చేశారు.  పోలీసుల వివరాల ప్రకారం..  ఒరిస్సాకు  చెందిన శుభంకుమార్ జెనా (26), బిశ్వజిత్ పాండా(25)   సిటీకి వచ్చి యూసుఫ్ గూడలో  ఉంటున్నారు. శుభంకుమార్ జెనా గచ్చిబౌలి నాలెడ్జ్ సిటీ లోని  టీవర్ బార్ అండ్ కిచెన్లో ఉద్యోగం చేసేవాడు.  మూడు నెలల కిందట  యాజమాన్యం అతన్ని పనిలో నుంచి తొలగించింది. 

 ఇదే సమయంలో తన స్నేహితుడు బిశ్వజిత్ పాండా ఉద్యోగం సైతం పోవడంతో ఇద్దరు ఖాళీగా ఉన్నారు.   దీంతో తనను ఉద్యోగంలో నుంచి తొలగించిన  బార్ లో  స్నేహితుడితో కలిసి దొంగతనానికి పథకం వేశారు.   ఓ బొమ్మ పిస్తోలును కొన్నారు.  ఈనెల 9న  ఇద్దరూ కలిసి  ఉదయం  బార్​లో  సెక్యూరిటీ గార్డును  బెదిరించి,  స్టోర్​రూమ్​లో  బంధించారు. అనంతరం బార్​లో  ఉన్న కౌంటర్ తాళాలు తీసుకొని రూ. 4.5 లక్షలను ఎత్తుకెళ్లారు.  బార్ యజమాని శ్యామ్ అనిరుధ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

కేసు దర్యాప్తు చేసిన పోలీసులు  బార్ మాజీ ఉద్యోగి శుభంకుమార్ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు.  శుభంకుమార్ ఒడిస్సా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు.  అతని నుంచి  1.50 వేల నగదు, ఓ ఐప్యాడ్, ఓ లాప్టాప్,   బొమ్మ పిస్తోలును స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు.  బిశ్వజిత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.