యాదాద్రి జిల్లాలో రూ.4,513 కోట్లతో రుణ ప్రణాళిక

​యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో 2024-–25 ఫైనాన్షియల్‌ ఇయర్‌‌కు సంబంధించి 4513.06 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  శుక్రవారం నాబార్డు వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్​ హనుమంతు జెండగే  రిలీజ్​ చేశారు.   వ్యవసాయరంగానికి రూ. 2784.44 కోట్లు,  సూక్ష్య రుణ ప్రణాళికకు రూ. 762.28 కోట్లు, విద్యారంగానికి రూ. 17.55 కోట్లు, గృహ నిర్మాణానికి రూ. 70.20 కోట్లు, ఇతర మౌళిక వసతులకు రూ. 11.76 కోట్లు, సోలార్ ఎనర్జీ సంబంధించి రూ. 15.01 కోట్లు బ్యాంకుల ద్వారా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

గత ప్రణాళికపై రివ్యూ

నూతన ప్రణాళిక రిలీజ్ అనంతరం గతేడాది రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో రివ్యూ నిర్వహించారు. వ్యవసాయ రంగానికి రూ. 2,976 కోట్లు ఇవ్వాల్సి ఉండగా గతేడాది డిసెంబర్​ వరకూ రూ2054.34 కోట్లు అందించామని బ్యాంకర్లు పేర్కొన్నారు. సూక్ష్మ రుణాల కింద సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు  రూ. 303.43 కోట్లు, విద్యకు రూ. 10.04 కోట్లు, ఇండ్లకు రూ. 36.87 కోట్లు అందించామని వివరించారు.

అదే విధంగా ప్రాధాన్యతా రంగాలకు రూ. 34.38 కోట్లు అందించినట్టు తెలిపారు. జిల్లాలో 12747(సెర్ఫ్​)  మహిళా సంఘాలకు రూ. 495.20 కోట్లు,  మెప్మాలోని 580 స్వయం సహాయక సంఘాలకు రూ. 60.11 కోట్లు  ఇచ్చామని వివరించారు.  రూ. 20 వేల రుణ విభాగంలోని వీధి వ్యాపారులకు రూ.  7.30 కోట్లు అందించినట్టు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..  లక్ష్యం మేరకు  రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు.

లోన్ల రికవరీకి  ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో శ్రద్ధ చూపాలని ఆదేశించరు.  ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ అధికారి శ్రీరామకృష్ణ, డీఆర్​డీవో ఎంఏ కృష్ణన్, ఆర్​బీఐ లీడ్ జిల్లా అధికారి తాన్య సంగ్మా, నాబార్డ్​ డీడీఎం  వినయ్ కుమార్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్ సుందర్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌‌ రమేశ్ బాబు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.