
- హర్షం వ్యక్తం చేసిన శాట్ చైర్మెన్ శివసేనా రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ.465 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌తో పోల్చితే రూ. 100 కోట్లు అదనంగా కేటాయింపులు చేశారు. తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు హకీంపేట్‌లోని క్రీడా పాఠశాలలోని సుమారు 200 ఎకరాల సువిశాల క్యాంపస్‌లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, ఫోర్త్ సిటీలో స్పోర్ట్స్ హబ్ సహా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో క్రీడా సదుపాయాలు కల్పిస్తామని బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో 12 క్రీడా అకాడమీలు నెలకొల్పనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి తెలంగాణ ఖ్యాతిని పెంచిన మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్, దీప్తి జీవాంజిలను బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బడ్జెట్‌లో క్రీడలకు భారీ కేటాయింపులు చేయటం పట్ల క్రీడాకారులు, కోచ్‌లు, శాట్ సిబ్బంది ఎల్బీ స్టేడియంలో హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
క్రీడలకు పెద్ద పీట : శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి
తెలంగాణను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన, నూతన స్టేడియాల నిర్మాణం, స్టేడియాల ఆధునీకరణపై క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) దృష్టి పెట్టనుంది.
ఈ ఏడాది కొత్త స్టేడియాల నిర్మాణం కోసం రూ.81.81 కోట్లు, రాష్ట్ర క్రీడా సంఘాల గ్రాంట్ సహా ప్రతిభావంతులైన క్రీడాకారుల నగదు ప్రోత్సాహకాలకు రూ.16.6 కోట్లు, స్పోర్ట్స్ స్కూల్స్ అభివృద్దికి రూ.51.68 కోట్లు సహా శాట్స్ నూతనంగా చేపట్టబోతున్న క్రీడాభివృద్ది కార్యక్రమాలకు రూ.275 కోట్లు కేటాయించటం హర్షణీయం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చివరి బడ్జెట్‌లో క్రీడలకు రూ.134.80 కోట్లు కేటాయించగా... కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.331 కోట్లు అదనంగా కేటాయించటం క్రీడాభివృద్ది పట్ల సర్కార్ చిత్తశుద్దికి నిదర్శమని శాట్ చైర్మెన్ కే. శివసేనారెడ్డి అన్నారు.