ఇందిరమ్మ ఇల్లు 600 SFT లోపే కడితేనే రూ.5 లక్షలు

 ఇందిరమ్మ ఇల్లు 600 SFT లోపే కడితేనే రూ.5 లక్షలు
  • కలెక్టర్లకు లేఖ రాసిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లను 600 చదరపు అడుగుల్లోపు నిర్మిస్తేనే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ. గౌతమ్ స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను 400 నుంచి 600 ఎస్ ఎఫ్ టీ లోపే నిర్మించాలని,  600  దాటితే ఇందిరమ్మ స్కీమ్ కు అనర్హులని ఆయన పేర్కొన్నారు. రాష్ర్టవ్యాప్తంగా 2,832 మంది బేస్ మెంట్ పూర్తి చేయగా ఇందులో 285 మంది 600 ఎస్ఎఫ్ టీల కంటే ఎక్కువగా ఇంటి నిర్మాణం చేస్తున్నట్టు ఏఈల తనిఖీలో వెల్లడయిందని ఎండీ తెలిపారు.  600 ఎస్ ఎఫ్ టీ దాటితే వాళ్లు బీపీఎల్ కుటుంబాల కిందకు రారని, కేంద్ర ప్రభుత్వ సాయం కూడా అందదని, ఆడిట్ లో ఇబ్బందులు వస్తాయని ఎండీ చెప్పారు.ఈ లబ్ధిదారుల అర్హతను మరో సారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ఎండీ ఆదేశించారు. ఈ 285 మంది లబ్ధిదారుల లిస్ట్ ను లేఖతో జత చేశారు. 600 ఎస్ ఎఫ్ టీ కంటే ఎక్కువ గా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించిన లబ్ధిదారుల్లో ఎక్కువగా నల్గొండ జిల్లాలో 42 మంది,  అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 13  మంది ఉన్నారని లేఖలో ఎండీ పేర్కొన్నారు.