బడ్జెట్ లో తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. రైతు పక్షపాతి ప్రభుత్వంగా.. వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చే ఆలోచనతో పలు రకాలు సంక్షేమ పథకాలు ప్రకటించారు.
>>> భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. కేసీఆర్ పాలనలో భూమి లేని రైతు కూలీలు ఆర్థికంగా, సామాజికంగా చితికిపోయారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్లందరికీ భరోసా వచ్చిందన్నారాయన. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు కూలీలకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సాయం అందించటం ద్వారా.. వాళ్ల జీవితాల్లో వెలుగు తీసుకువస్తున్నట్లు వెల్లడించారాయన.
>>> కష్టపడి పంట పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో.. 33 రకాల సన్న వడ్లు పండించే రైతులకు.. క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించారు. ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని వెల్లడించారు. దీని ద్వారా వరి పంటను లాభసాటిగా మార్చటం జరుగుతుందన్నారు. సన్న రకం వడ్లు పండించే రైతులకు ఆర్థిక ప్రయోజనంగా ఉంటుందన్నారు.
>>> పదేళ్లుగా రైతులకు బీమా అనేది లేదని.. అతివృష్టి.. అనావృష్టి వల్ల పెట్టుబడి సాయం నష్టపోయి ఎంతో మంది రైతులు ఆర్థికంగా చితికిపోయారన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి సఫల్ యోజన పథకంలో చేరనున్నట్లు వెల్లడించారు. ఈ బీమా పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారాయన. పైసా ఖర్చు లేకుండా రైతుకు పంట భద్రత కల్పిస్తున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారాయన.