
- ఎస్ఎంఏఎం స్కీం కింద జోగులాంబ జిల్లాకు రూ.56.88 లక్షలు
- చిన్న, సన్నకారు, మహిళా రైతులకు ప్రయారిటీ
- ఈ నెల చివరి నాటికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు
గద్వాల, వెలుగు: రాష్ట్ర సర్కారు వ్యవసాయంలో యాంత్రీకరణకు చేయూతనిచ్చేందుకు స్కీమ్ లను ప్రవేశపెట్టింది. జోగులాంబ గద్వాల జిల్లాకు ఎస్ఎంఏఎం(కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ స్కీం) కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.56.88 లక్షలు మంజూరయ్యాయి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందించనున్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులు మార్చి చివరి నాటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వం పట్టించుకోలే..
గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పనిముట్లు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో రైతులే సొంత డబ్బులు పెట్టుకొని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా రైతులకు అందకుండా చేశారనే విమర్శలు వచ్చాయి. గతంలో రైతులకు టార్పాలిన్ కవర్లు, నాగళ్లు, ఇతర వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, స్పింక్లర్లు, డ్రిప్ తదితర వాటికి సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రభుత్వం ప్రోత్సహించేది.
పదేండ్లుగా ఆ పథకాలన్నీ నిలిచిపోయాయి. ఈక్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రైతులను ప్రోత్సహించేందుకు యాంత్రీకరణ పరికరాలను అందించాలని నిర్ణయించింది. యాంత్రీకరణతో కూలీల ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని భావిస్తోంది. ఇందులోభాగంగా గతంలో ఉన్న అన్ని సబ్సిడీలను పునరుద్ధరించాలని
నిర్ణయించింది.
గద్వాల జిల్లాకు రూ.56.88 లక్షలు
జోగులాంబ గద్వాల జిల్లాకు రూ.56.88 లక్షలు మంజూరయ్యాయి. మార్చి నెలాఖరులోగా లబ్ధిదారులను ఎంపిక చేసి అవసరమైన యంత్రాలు, ఉపకరణాలు అందించేలా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దరఖాస్తులను అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు స్వీకరిస్తారు. అందుబాటులో ఉన్న పనిముట్లను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, ఎంపికైన రైతులకు అవసరమైన యంత్రాలు పరికరాలపై రాయితీ పొందే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు వివిధ రకాల ఉపకరణాలు సబ్సిడీపై అందించనున్నారు. 73 బ్యాటరీ స్ప్రేయర్లు, 73 పవర్ స్ప్రేయర్లు, 30 రోటవేటర్లు, 5 సీడ్ కమ్ ఫార్టీడ్రిల్స్, 39 డిస్క్ హారో కేజీ వీల్స్, 2 పవర్ టిక్లర్లు, 2 స్ట్రాబేలర్స్, 3 ట్రాక్టర్లు, 3 బండ్ ఫార్మర్లు, 2 పవర్ విడర్లు, 3 బ్రష్ కట్టర్లు అందించనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి..
మార్చి నెల చివరి వరకు ఎస్ఎంఏఎం స్కీం కింద అందించే యాంత్రీకరణ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సబ్సిడీపై పంపిణీ చేసే వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.- సక్రియా నాయక్, డీఏవో, గద్వాల