
- 18,180 మంది కూలీలకు ఆత్మీయ భరోసా సాయం
- రైతులు, కూలీలకు కలిపి రూ.579 కోట్లు విడుదల
- 51,912 మందికి కొత్త రేషన్ కార్డులు
- పాత కార్డుల్లో 1,03,674 మంది పేర్ల నమోదు
- 72 వేల మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
- 563 గ్రామాల్లో 6,87,677 మంది లబ్ధిదారులు
- ఒకేరోజు అమల్లోకి నాలుగు స్కీమ్‌లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 4 సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి. మండలానికి ఒక గ్రామం చొప్పున 563 గ్రామాల్లో 6 లక్షల 87 వేల 677 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం 4 స్కీమ్స్‌ను అమలు చేసింది. 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా పైసలు జమచేసింది. మరో18,180 మంది రైతు కూలీల అకౌంట్లలో నూ రూ.6 వేల చొప్పున వేసింది. 72 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతోపాటు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కొత్త రేషన్‌కార్డులకు మోక్షం కల్పించింది. సోమవారం ఆయా గ్రామాల్లోని 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వం, పాతకార్డుల్లో లక్షకుపైగా పేర్లను యాడ్ చేసింది.
రిపబ్లిక్‌డే సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 4 స్కీమ్స్‌ను లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వం, 24 గంటల వ్యవధిలో ఆయా సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. గతానికి భిన్నంగా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని అర్హులైన అందరికీ ఈ పథకాలను సంపూర్ణంగా అమలు చేయడం ప్రారంభించింది. మండలానికి ఒక గ్రామం చొప్పున 563 గ్రామాల్లో సోమవారం 4 స్కీమ్స్‌ను అమలుచేసిన ప్రభుత్వం, త్వరలోనే మండలాలు.. గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకటించి, అన్నిచోట్లా ఆయా పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. గతంలో ఎకరాలవారీగా రైతుబంధు విడుదల చేయగా, ఇప్పుడు గ్రామాలవారీగా రైతు భరోసా జమ చేస్తున్నది. అంతకుముందు ఒకే గ్రామంలో ఎకరా దాకా ఉన్నవాళ్లకి రైతుబంధు రిలీజ్‌చేస్తే.. మిగతా వాళ్లు తమ వంతు కోసం ఎదురుచూసేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేకుండా విస్తీర్ణంతో సంబంధంలేకుండా గ్రామంలో ఉన్న రైతులందరికీ ఒకే రోజు రైతుభరోసా డబ్బులు పడ్డాయి. మిగిలిన స్కీమ్స్ కూడా ఇలాగే అమలుకావడంతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.
భరోసా స్కీమ్స్‌కు రూ. 579 కోట్లు
32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 9,48,333 ఎకరాల సాగుయోగ్యమైన భూములకు తొలి విడత రైతు భరోసా నిధులను సర్కారు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి 4,41,911 మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ. 6 వేల చొప్పున ఒక్క రోజులోనే మొత్తం రూ.569 కోట్లు జమ చేసింది. 26న బ్యాంకులకు సెలవు దినం కావడంతో 27వ తేదీ ఉదయం నుంచే ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో పడ్డాయి. అలాగే, భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు తొలిసారి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని సర్కారు ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నది. తొలిరోజున దాదాపు 18,180 వ్యవసాయ కూలీ కుటుంబాలకు రూ.6 వేల చొప్పున ఈ నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలిరోజు ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది.
అర్హులైన ప్రతీ రైతుకు రైతు భరోసా : తుమ్మల
రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా అందజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా పంట పెట్టుబడి సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచి మొదటి విడత ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామని ఆయన వివరించారు.
కొత్తగా 15,414 రేషన్ కార్డులు
అర్హులైన కుటుంబాలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కొత్తరేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. వీటితోపాటు పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను అధికారులు నమోదు చేస్తున్నారు. తొలి రోజున 15,414 కొత్త రేషన్ కార్డులు అందజేశారు. దీంతో ఆయా కుటుంబాల్లోని 51,912 మందికి లబ్ధి చేకూరింది. తెలంగాణ వచ్చాక పెళ్లిచేసుకొని అత్తగారింటికి వచ్చిన కోడళ్లు, కొత్తగా పిల్లలు కలిగినవారి పేర్లను ఇప్పటి వరకూ రేషన్‌కార్డుల్లో చేర్చలేదు. తాజాగా, ఆయా గ్రామాల్లో ఇలాంటి పెండింగ్అప్లికేషన్లను ఆఫీసర్లు పరిష్కరించారు. ఇందుకు సంబంధించి 1,03,674 మంది పేర్లను కొత్తగా రేషన్‌కార్డుల్లో నమోదు చేశారు. వచ్చే నెల నుంచి వీరందరికీ రేషన్ పంపిణీ చేస్తామని ఆఫీసర్లు ప్రకటించారు. మరోవైపు ఆయా గ్రామాల్లో ఇండ్లు లేని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా 72 వేల ఇండ్లు మంజూరు చేశారు. వీరి బ్యాంకు వివరాలు అధికారులు ఇప్పటికే నమోదు చేసుకోగా, త్వరలోనే రూ.లక్ష చొప్పున మొదటి విడత ఫండ్స్ రిలీజ్చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.