రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో రూ. 60 కోట్లతో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు కాబోతున్నట్లు బీజేపీ మున్సిపల్ ప్రెసిడెంట్ రాంబాబు, మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లేపల్లి రాజేందర్‌రెడ్డి తెలిపారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును మంజూరు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో శనివారం వారు తెల్లాపూర్‌లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెల్లాపూర్ ప్రాంతంలో మురుగు నీటి వ్యవస్థ లేక స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని 6 నెలలుగా ఉన్నతాధికారులతో మాట్లాడారని, ఎంపీ చేసిన కృషి ఫలితంగానే తెల్లాపూర్‌కు ఎస్టీపీ ప్లాంట్ మంజూరైందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ ఎస్టీపీ సమస్యను రఘునందన్ దృష్టికి తీసుకెళ్లారని, ఎంపీగా గెలిచిన వెంటనే తెల్లాపూర్‌కు సీవరేజ్ ప్లాంట్‌ను మంజూరు చేయించారని తెలిపారు.
దశాబ్ధాలుగా పరిష్కారం కాని సమస్యను తీర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఎంపీ రఘునందన్‌రావుకి తెల్లాపూర్ ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెల్లాపూర్ ప్రాంతంలో పారిశుధ్య సమస్యలు తీరి సమగ్రాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు సహాయపడనుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ప్రవీణ్ యాదవ్, మున్సిపాలిటీ నాయకులు ప్రసన్న, కృష్ణ యాదవ్, రాజిరెడ్డి, హృషికేశ్, మాణిక్ రెడ్డి, కోటె రవి పాల్గొన్నారు.