రివార్డ్స్‌ రిడీమ్‌ చేసుకోవాలని చెప్పి.. రూ. 65 లక్షల క్రిప్టో కరెన్సీ చోరీ

వనపర్తి/కొత్తకోట, వెలుగు: వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన ఓ బిట్‌ కాయిన్‌ ట్రేడర్‌ వాలెట్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసి రూ.65 లక్షలను కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తకోటకు చెందిన యాదయ్య అనే వ్యక్తి ఎనిమిదేండ్లుగా బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ చేస్తున్నాడు. రెండు రోజుల కింద గుర్తు తెలియని వ్యక్తులు యాదయ్యకు ఫోన్‌ చేసి షేర్స్‌ ప్రమోట్‌ చేస్తామని చెప్పారు. అలాగే రివార్డ్స్‌ రూపంలో వచ్చిన డబ్బులను రిడీమ్‌ చేసుకోవాలని సూచించారు.

అయితే అమౌంట్‌ యాడ్‌ కాలేదని యాదయ్య చెప్పడంతో పాస్‌వర్డ్‌ చెబితే తాము చెక్‌ చేస్తామని నమ్మించడంతో యాదయ్య పాస్‌వర్డ్‌ చెప్పేశాడు. తర్వాత తన అకౌంట్‌ను చెక్‌ చేసుకోగా అందులో ఉండాల్సిన రూ.65 లక్షలు కనిపించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.