- ట్రేడింగ్, ఇన్ వెస్ట్ మెంట్ బిజినెస్ పేరుతో సైబర్ ఫ్రాడ్
- పంజాబ్ లోని జలంధర్ లో ముగ్గురు నిందితుల అరెస్ట్
- జగిత్యాల, సైబర్ క్రైమ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్
మెట్ పల్లి, వెలుగు: వాట్సాప్ లింక్ పంపించి డబ్బులు కొట్టేస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మెట్ పల్లి టౌన్ కు చెందిన ఓ డాక్టర్ స్టాక్ మార్కెట్ లో ఇన్ వెస్ట్ మెంట్ చేసేందుకు కొద్ది నెలల కింద ఆన్ లైన్ లో ఏసీ మాక్స్ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేశాడు. వెంటనే అక్సెల్ స్టూడెంట్–95 అనే వాట్సాప్ గ్రూప్ లో లింక్ మెసేజ్ వచ్చింది. దీంతో ట్రేడింగ్ లో ఇన్ వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు. వెంటనే డాక్టర్ రూ.69 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తిరిగి తీసుకుందామని ప్రయత్నిస్తే లింక్ ఓపెన్ కాలేదు. మోసపోయాయని తెలుసుకుని గత మే నెలలో సైబర్ క్రైమ్ సెల్ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో చేపట్టేందుకు మెట్ పల్లి డీఎస్పీ ఎ. రాములు, మెట్ పల్లి, కోరుట్ల సీఐలు నిరంజన్ రెడ్డి, సురేశ్ బాబుతో కలిపి ఏడుగురితో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. డాక్టర్ డబ్బులు కొట్టేసిన నిందితులు బ్యాంక్ ఖాతాలను గుర్తించి విచారణ చేపట్టారు. పంజాబ్ లోని అమృతసర్, జలంధర్ కు చెందిన నిందితులుగా గుర్తించారు. అక్కడికి వెళ్లి సుమేశ్కపూర్ (36), రాజీవ్ సింగ్(36), జతింధర్ కుమార్(37)ను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు టీమ్ గా ఏర్పడి ఈజీగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు. జలంధర్ టౌన్ లోని యూనియన్ బ్యాంకు రీజినల్ మేనేజర్ అర్జున్ చౌహాన్(36 )ను పరిచయం చేసుకుని ఇన్ వెస్ట్ మెంట్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతూ కొట్టేసిన డబ్బులను దుబాయిలో ఉండే వ్యక్తికి పంపిస్తున్నారు.
సుమేశ్ కపూర్ పేరిట నకిలీ కంపెనీ పెట్టి ఓ బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశాడు. డాక్టర్ డబ్బులు రూ.24 లక్షలు అందులో జమ అయ్యాయి. వాటిని అర్జున్ చౌహాన్ సూచన మేరకు రూ. 24 లక్షలను విత్ డ్రా చేసి దుబాయిలో ఉండే రాజు భయ్య అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. ఇందుకు అర్జున్ ముగ్గురికి రూ. 2 లక్షలు కమీషన్ ఇచ్చాడు. నిందితుల వద్ద 15 పాస్ బుక్ లు, 10 చెక్ బుక్ లు, 20 డెబిట్, క్రెడిట్ కార్డులు, 3 మొబైల్స్, 2 ల్యాప్ టాప్ లు, 14 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని జలంధర్ కోర్టులో హాజర పరిచి ట్రాన్సిట్ వారంట్ పై మెట్ పల్లికి తీసుకొచ్చారు.
గురువారం మెట్ పల్లి కోర్టులో రిమాండ్ చేశారు. బాధిత డాక్టర్ కు రూ. 10 లక్షలు అప్పగించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ ను తెలంగాణ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.