శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.7 కోట్ల డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.7 కోట్ల డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‎లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో శుక్రవారం (నవంబర్ 1) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు రూ.7 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. దీపావళి పండుగ (అక్టోబర్ 31) రోజు బ్యాంకాక్ నుండి డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోందని ఇంటలిజెన్స్ అధికారులు ఎయిర్ పోర్టు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందించారు. ఇంజలిజెన్స్ సూచన మేరకు అప్రమత్తమైన డీఆర్ఐ అధికారులు ఎయిర్ పోర్టులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. 

Also Read :- మోమోస్ ఘటనలో ఆరుగురు అరెస్ట్

ఈ క్రమంలోనే బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో వారిని అడ్డుకుని అధికారులు సోదాలు చేశారు. వారి చెక్-ఇన్ లగేజీని తనిఖీ చేయగా.. 13 ప్యాకెట్లలో గంజాయికి సంబంధించిన హైడ్రోపోనిక్ డ్రగ్స్‎ను గుర్తించారు. నిందితుల నుండి 7.096 కిలోల హైడ్రోపోనిక్ డ్రగ్‎ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ స్లగ్మింగ్ చేస్తోన్న ఇద్దరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం ఇద్దరిని  జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు.