
- సెకండ్ ఫేజ్ అమలుకు నిధులివ్వాలని విజ్ఞప్తి
- ఏపీ ఇవ్వకుంటే తొలుత తామే ఇస్తామని ఇదివరకే చెప్పిన తెలంగాణ
- ఫేజ్ 2లో 9 చోట్ల టెలిమెట్రీల ఏర్పాటుకు 2022లో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: కృష్ణా ప్రాజెక్టుల్లో నీటి వినియోగాన్ని పకడ్బందీగా లెక్కించేందుకు రెండో విడత టెలిమెట్రీల ఏర్పాటుకు నిధులను ఇవ్వాల్సిందిగా తెలంగాణను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) కోరింది. ఈ ఏడాది జనవరి 21న నిర్వహించిన19వ బోర్డు మీటింగ్లో దీనిపై ఇప్పటికే చర్చించామని, అందుకు అనుగుణంగా రెండు రాష్ట్రాలూ రూ.7 కోట్ల బడ్జెట్ను వాటి కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
టెలిమెట్రీలను ఏర్పాటు చేస్తే నీటి వినియోగం, లెక్కింపును కచ్చితత్వంతో పారదర్శకంగా చేపట్టవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు బోర్డు మెంబర్ ఆర్ఎన్ శంఖువా లేఖ రాశారు. అయితే, టెలిమెట్రీల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నా, ఏపీ మాత్రం ససేమిరా అంటున్నది. అవసరమైతే తొలుత ఆ నిధులను భరిద్దామని కూడా తెలంగాణ సర్కారు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు అధికారులు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో టెలిమెట్రీల ఏర్పాటుకు నిధుల కోసం బోర్డు తాజాగా లేఖ రాసింది.
ఇప్పటికే18 చోట్ల ఏర్పాటు..
ఫేజ్1లో భాగంగా ఇప్పటికే కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేశారు. అయితే, వాటిలో కొన్ని సరిగ్గా పనిచేయడం లేదు. సరైన సమాచారాన్ని పంపడం లేదు. దీంతో ఏపీ అడ్డు లేకుండా నీటిని తరలిస్తున్నది. దీనిపై బోర్డుకు ఎన్నోసార్లు తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు.
పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాల్వ సహా వివిధ ప్రాంతాల నుంచి నీటిని ఏపీ అక్రమంగా తీసుకుపోతున్నదని ఎన్నోసార్లు ఆరోపించారు. దీంతో రెండు రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి లెక్కలను తీసేందుకు ముఖ్యమైన 9 చోట్ల ఫేజ్ 2లో టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలని 2022 సెప్టెంబర్లో నిర్ణయించారు.
పోతిరెడ్డిపాడు, కేసీ కెనాల్, సాగర్ కుడి, ఎడమ కాల్వలు, పాలేరు, తిరువూరు, విజయవాడ ప్రకాశం బ్యారేజీ కాల్వలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ, అందుకు బడ్జెట్ను ఇచ్చేందుకు మాత్రం ఏపీ ముందుకు రావడం లేదు. కాగా, ఈ నెల 27న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) మీటింగ్ నిర్వహించనున్నట్టు పీపీఏ మెంబర్ సెక్రటరీ రఘురాం తెలిపారు.
హైదరాబాద్లోని సెంట్రల్ వాటర్ కమిషన్కు చెందిన కృష్ణా గోదావరి భవన్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మీటింగ్ కు హాజరు కావాలని మంగళవారం రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల అధికారులు తమ సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని కోరారు