అది కార్పొరేట్ కంపెనీ.. బాగా డబ్బున్న కంపెనీ.. ఏడాదిలోనే వేల కోట్ల లాభాలు వచ్చాయి.. దీంతో ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది ఆ కంపెనీ.. డబ్బును నేరుగా బ్యాంక్ ఖాతాల్లో వేస్తే మజా ఏముందీ అని ఆలోచించిన కంపెనీ.. ఉద్యోగులకు ఓ పరీక్ష పెట్టింది.. బోనస్ గా ఇవ్వాలనుకున్న 70 కోట్ల రూపాయలను నగదుగా మార్చేసింది.. డబ్బు నోట్లను ఓ టేబుల్ పై పోసింది.. ఉద్యోగులకు పరీక్ష పెట్టింది.. ఏంటా పరీక్ష.. ఎవరెవరికి ఎంత బోనస్ వచ్చింది అనేది తెలుసుకుందామా..
చైనా దేశం.. హెనాన్ మైనింగ్ క్రేన్ కో కంపెనీ. మైనింగ్ వ్యాపారంలో వందల కోట్లు లాభాలు సంపాదించిన కంపెనీ.. ఉద్యోగులకు 70 కోట్ల రూపాయలు బోనస్ ప్రకటించింది. ఆఫీసులో పెద్ద టేబుల్ ఏర్పాటు చేసింది. 70 కోట్ల రూపాయల నోట్లను టేబుల్ పై పోసింది. ఉద్యోగులు అందర్నీ పిలిచింది. కండీషన్స్ పెట్టింది. జస్ట్ 15 అంటే 15 నిమిషాల టైం ఇస్తున్నాం.. ఈ 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడతారో అంత డబ్బు బోనస్ గా తీసుకోవచ్చు అనే కండీషన్ పెట్టింది. ఇక్కడ విశేషం ఏంటంటే 70 కోట్ల రూపాయల నగదు మొత్తాన్ని చిన్న నోట్లుగా.. 200 రూపాయల నోట్లుగా పెట్టింది ఆ కంపెనీ.
ఈ పోటీలో అత్యధికం11 లక్షల రూపాయలను ఓ ఉద్యోగి లెక్కించాడు.. ఇదే అత్యధికంగా.. ఎక్కువ మంది ఉద్యోగులు 2 నుంచి 4 లక్షల రూపాయలు మాత్రమే లెక్కించారు. ఒకే ఒక్క ఉద్యోగి 15 నిమిషాల్లో 11 లక్షల రూపాయలు లెక్కించి బోనస్ పట్టుకెళ్లాడు..
కంపెనీ పోటీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగులు ఏమన్నా బ్యాంకుల్లో పని చేసే క్యాషియర్లా ఏంటీ.. టకటకా లెక్కించటానికి అంటూ తిట్టిపోస్తున్నారు. ఉద్యోగుల పనికి గౌరవంగా బ్యాంకు ఖాతాల్లో వేయొచ్చు కదా అంటూ తిడుతున్నారు. దీని వల్ల నగదు లెక్కించలేని.. అలవాటు లేని సమర్థులైన ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. కంపెనీలో పని చేసే ఉద్యోగులు అందరికీ వారి వారి జీతాల ఆధారంగా బోనస్ వేస్తే బాగుండేది అంటున్నారు. ఇలాంటి పోటీ వల్ల అర్హులైన, టాలెంట్ ఉన్న ఉద్యోగులు తక్కువ బోనస్ పొందటం జరుగుతుంది అనే వాదన రేకెత్తిస్తున్నారు.
ఏదిఏమైనా 70 కోట్ల డబ్బు.. 15 నిమిషాల టైం.. కళ్ల ముందు అంత డబ్బు కనిపిస్తున్నా.. కావాల్సినంత తీసుకెళ్లలేని ఉద్యోగులు.. మొత్తానికి చైనా కంపెనీ బోనస్ పోటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.