
- కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అభివృద్ధికి ఖర్చు
- రోడ్లు, తాగు నీరు, ఎస్టీపీల నిర్మాణ పనులు
- త్వరలో కొత్త మున్సిపాలిటీల్లో బడ్జెట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్ లో ప్రభుత్వం సుమారు రూ.760 కోట్ల నిధులు కేటాయించింది. సిటీలు, పట్టణాల అభివృద్ధికి మొదటి సారిగా బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల బడ్జెట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, వివిధ స్కీమ్ ల నుంచి వచ్చే నిధులు అదనం కానున్నాయి. గత ప్రభుత్వంలో వివిధ జిల్లాలకు సీఎం వెళ్లిన సమయంలో సీఎం విచక్షణ అధికారాల కింద పలు కార్పొరేషన్లకు రూ. 100 కోట్లు, మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించినా ఫండ్స్ కొరతతో కొంత మాత్రమే రిలీజ్ అయ్యాయి.
కార్పొరేషన్లలో మెర్జ్ అయిన మున్సిపాలిటీలు, మున్సిపాలిటీల్లో మెర్జ్ అయిన గ్రామ పంచాయతీల్లో నిర్మాణ దశలో ఉన్న పనులు, వాటి పెండింగ్ బిల్స్‌తో పాటు వీటి పరిధి పెరిగిన నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయనున్నారు.
ఈ పనులకు నిధుల ఖర్చు
నగరాల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, రోడ్ల అభివృద్ధి, విద్యుత్ సరఫరా సౌకర్యాలు, డ్రైనేజీలు పొంగకుండా ఏర్పాట్లు, డ్రైనేజీల నుంచి నీళ్లు చెరువుల్లో కలవకుండా ఎస్టీపీల నిర్మాణం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, చెరువు కట్టలపై గ్రీనరీ, సిటీల సుందరీకరణ, గ్రీనరీ పెంచటం, హైవేలపై డివైడర్లు, ప్రభుత్వ స్థలాల రక్షణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం వంటి పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో ఎస్టీపీల నిర్మాణానికి మున్సిపల్ డిపార్ట్ మెంట్ లోని పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. త్వరలో పనులు స్టార్ట్ కానున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా వచ్చే 30 ఏండ్ల వరకు భవిష్యత్ లో పెరిగే నీటి వినియోగం, జనాభా పెరుగుదలకు అనుగుణంగా బలోపేతం చేయనున్నారు.
సుందరీకరణలో భాగంగా సిటీల్లో సర్కిళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు, ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు, ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, సరిహద్దులు, మున్సిపాలిటీలకు ఎంట్రీ, ఎగ్జిట్ లో స్వాగతం చెప్పే తోరణాలు ఏర్పాటు చేయనున్నారు. తడి, పొడి చెత్తను విడగొట్టి, డంపింగ్ యార్డ్ లకు తరలించటం, శ్మశానాల ఏర్పాటు, మొక్కలు నాటి గ్రీనరీని పెంపొందించటం వంటి పనులను రానున్న రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు.
కార్పొరేషన్లు, కొత్త మున్సిపాలిటీలపై ఫోకస్
రాష్ట్రంలో కొత్తగా మహబూబ్ నగర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లను, 12 మున్సిపాలిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి తోడు కొత్తగూడెం, పాల్వంచను కలిపి కార్పొరేషన్, మరో 6 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయగా.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లు ఆమోదం పొందనుంది. ఇప్పుడు మొత్తం 157 మున్సిపాలిటీలు, 15 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ ఫండ్స్ వాటికి కేటాయించనున్నారు. అయితే ఈ నిధుల మంజూరులో కొత్త మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సీడీఎంఏ అధికారులు చెబుతున్నారు.
కొత్త మున్సిపాలిటీల బడ్జెట్ 30 కోట్లు!
రాష్ట్రంలో కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మినహా మిగతా వాటి పాలకవర్గం గడువు జనవరి 26న ముగిసింది. దీంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది. గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అయిన తరువాత మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయితే కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ల అనుమతితో కొద్ది రోజుల్లో స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక బడ్జెట్ తీసుకురానున్నారని అధికారులు చెబుతున్నారు. కొత్త మున్సిపాలిటీల్లో బడ్జెట్ సుమారు రూ.30 కోట్లతో ఉంటుందని సమాచారం.