పాలమూరు ప్యాకేజీ 3కి రూ.780 కోట్లు

పాలమూరు ప్యాకేజీ 3కి రూ.780 కోట్లు
  • నార్లపూర్ నుంచి ఏదుల వరకు చేపట్టిన పనులకు నిధులు విడుదల

హైదరాబాద్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ప్యాకేజీ 3 పనులకు రాష్ట్ర సర్కారు నిధులు విడుదల చేసింది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు అప్రోచ్ చానెల్ ఎర్త్‌‌‌‌ వర్క్, ఓపెన్ కెనాల్, హెడ్ రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ.780.63 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

రిజర్వాయర్ల నడుమ కాల్వకు 1.725 కిలోమీటర్ పాయింట్ నుంచి 2.125 కిలోమీటర్‌‌‌‌‌‌‌‌ వరకు, 2.325 కిలోమీటర్ పాయింట్ నుంచి 2.675 కిలోమీటర్ వరకు కంట్రోల్ బ్లాస్టింగ్‌‌‌‌కు సంబంధించి ఎంతమేర పనులు చేశారో డాక్యుమెంటరీ ఆధారాలతో విశ్లేషించాలని, క్వాలిటీ కంట్రోల్ వింగ్ సమక్షంలో దానిని నిర్వహించాలన్నారు. అనంతరం కమిటీ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్‌‌‌‌తో దీనిపై చర్చించాలన్నారు. కంట్రోల్ బ్లాస్టింగ్‌‌‌‌కు సంబంధించి వారి నుంచి సలహాలు తీసుకోవాలని సూచించారు. కెనాల్ 6.325 కిలోమీటర్ పాయింట్ నుంచి 6.65 కిలోమీటర్ వరకు 200 మీటర్ రేడియల్ డిస్టెన్స్‌‌‌‌ను దాటి కంట్రోల్ బ్లాస్టింగ్‌‌‌‌ చేసుకునేందుకు అనుమతినిచ్చారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ మాన్యువల్‌‌‌‌లో నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలని సూచించారు.