కోటి రెండు కోట్ల రూపాయలు కాదు.. అక్షరాల 8 కోట్ల 40 లక్షల రూపాయలు.. అన్నీ 500 రూపాయల నోట్లు.. పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో.. తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తు్న్నారు. మామూలు కార్లు, బస్సుల్లో అయితే తనిఖీలు ఉంటాయనే భయంతో.. సరికొత్త ప్లాన్ వేశారు. పైపుల లారీలో.. పైపుల మధ్య డబ్బుల బ్యాగులను తరలిస్తూ.. అడ్డంగా దొరికిపోయారు. 2024, మే 9వ తేదీ తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం మెదక్ నుంచి ఏపీ రాష్ట్రం గుంటూరుకు తరలిస్తున్న 8 కోట్ల 40 లక్షల రూపాయలను ఎన్టీఆర్ జిల్లాలో పట్టుకున్నారు ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది.
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లాలో అక్రమంగా పైపుల లోడ్ లారీలో తరలిస్తున్న 8 కోట్ల 40లక్షల రూపాయలను పట్టుకున్నారు పోలీసులు. గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర తనిఖీ చేస్తుండంగా ఈ నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మెదక్ జిల్లా నుంచి గుంటూరుకు డబ్బు తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ మొత్తాన్ని జిల్లా పరిశీలన బృందాలకు అందజేస్తామని జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ తెలిపారు. దీనిపై ఈసీ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తదుపరి చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు.