
న్యూఢిల్లీ: అమెరికాలో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ పెట్టి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టిన లిథువేనియన్ దేశస్తుడిని కేరళలో పోలీసులు అరెస్టు చేశారు. లిథువేనియాకు చెందిన అలెక్సెజ్ కొన్నేండ్ల క్రితం ‘గ్యారెంటెక్స్’ పేరుతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేశాడని అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆరోపించారు. దీని ద్వారా కంప్యూటర్ హ్యాకింగ్, నార్కోటిక్స్ లావాదేవీలు, ర్యాన్సమ్‌వేర్ వంటి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని తెలిపారు.
దీంతో వచ్చిన ఆదాయాన్ని మనీలాండరింగ్ చేశాడని చెప్పారు. ఇప్పటివరకు దాదాపుగా 96 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్లు) మోసానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. దీంతో అమెరికాలో అలెక్సెజ్ పై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే 2022 ఏప్రిల్‌లో అమెరికా అతడిపై ఆంక్షలు విధించింది. నిందితుడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.
అతడు భారత్ లో ఉన్నట్టు తెలుసుకున్న అమెరికన్ అధికారులు.. కేంద్ర విదేశాంగశాఖను సంప్రదించారు. అనంతరం ప్రొవిజినల్ అరెస్టు వారెంట్ జారీ చేయగా.. సీబీఐ, కేరళ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి తిరువనంతపురంలో నిందితుడైన అలెక్సెజ్‌ను అరెస్టు చేశారు. ఆయనను త్వరలోనే పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు.