
- దుబాయ్ నుంచి రాగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టివేత
- ఈడీ దర్యాప్తులో వెల్లడైన ఫాల్కన్ చైర్మన్ అమర్‌దీప్ బిజినెస్
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో రూ.1,700 కోట్లు వసూలు
- డిపాజిటర్లకు రూ.850 కోట్లు చెల్లింపు.. మిగతావి ఇవ్వలేక దుబాయ్‌కి పరార్
- ఫాల్కన్ పోంజీ స్కీమ్ సొమ్ముతో ఎయిర్ అంబులెన్స్ కొనుగోలు
- రూ.3 కోట్లతో ఇంటీరియర్.. గంటకు 3,500 డాలర్లు చార్జ్
హైదరాబాద్, వెలుగు: మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ పేరుతో రూ.850 కోట్లు మోసం చేసి.. బోర్డు తిప్పేసిన ఫాల్కన్ (క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్) సంస్థ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఫాల్కన్ గ్రూప్ చైర్మన్, ఎండీ అమర్‌దీప్‌కుమార్‌కు చెందిన ‘ఎన్935 హెచ్ హాకర్ 800ఏ’ చార్టర్ ఎయిర్ క్రాఫ్ట్‌ను శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీజ్ చేసింది. ఈ నెల 5న రాత్రి 10.15 గంటలకు ఎయిర్ అంబులెన్స్ దుబాయ్‌కి వెళ్లినట్టు గుర్తించింది. శుక్రవారం రాత్రి 11 గంటలకు తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో కస్టమ్స్ ఇంటెలిజెన్స్ అధికారులు ట్రేస్ చేశారు.
ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..హైటెక్ సిటీ కేంద్రంగా ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో అమర్‌దీప్‌కుమార్ పోంజీ స్కీమ్ ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా 6,979 మంది డిపాజిటర్ల నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేశాడు. అందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు చెల్లించకుండా సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితుల ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్(ఈవోడబ్ల్యూ) గత నెల 15న కేసు నమోదు చేసింది. బిజినెస్ హెడ్ పవన్‌కుమార్ ఓదెల, డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్ట్ చేసింది.
మెడికల్ అంబులెన్స్‌గా గంటకు 3,500 డాలర్లు
ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో డిపాజిటర్ల నుంచి కొళ్లగొట్టిన డబ్బును అమర్‌దీప్‌కుమార్.. 22 షెల్ కంపెనీల ద్వారా యూఏఈకి తరలించారు. 2024 ఫిబ్రవరిలో యూఎస్‌ఏకు చెందిన ప్రెస్టీజ్ జెట్స్ ఇంక్ అనే కంపెనీ ద్వారా 1.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.14 కోట్లు)తో బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్ ‘ఎన్935హెచ్ హాకర్ 800ఏ’ కొనుగోలు చేశాడు. వ్యాపార అవసరాలు, మెడికల్ అంబులెన్స్‌కు వినియోగించే విధంగా మరో రూ.3 కోట్లు ఖర్చు చేసి ఇంటీరియర్ చేయించాడు. మెడికల్ అంబులెన్స్‌గా గంటకు 3 వేల డాలర్ల నుంచి 3,500 డాలర్ల అద్దె వసూలు చేస్తున్నాడు.
దీన్ని సప్తరిశి ఛటర్జీ అనే వ్యక్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాడు. ఐసీఏటీటీ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేస్తున్నారు. ఢిల్లీ, దుబాయ్‌ల నుంచే ఎక్కువగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం సంపాదించారు. ఫాల్కన్ సంస్థ బోర్డు తిప్పేసిన తర్వాత జనవరి 22న అమర్‌దీప్ కుమార్, వివేక్ సేత్ సహా సీఈవో యోగేందర్, సీఓఓ ఆర్యన్ సింగ్ దుబాయ్‌కి పారిపోయారు. ఈ ముగ్గురిపై ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేశారు. సైబరాబాద్ ఈవోడబ్ల్యూ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసింది. దర్యాప్తులో భాగంగా అమర్‌దీప్‌కుమార్ ఆస్తుల వివరాలు సేకరించింది.
వ్యాపారవేత్తలకు అద్దెకు ఇస్తూ
8 సీట్ల కెపాసిటీతో ఉన్న ‘ఎన్ 935హెచ్ హాకర్ 800ఏ’ బిజినెస్ ఎయిర్ క్రాఫ్ట్‌ను పారిశ్రామికవేత్తల వ్యక్తిగత అవసరాలకు, అద్దె విధానంలో ఎయిర్ అంబులెన్స్‌గా కూడా వినియోగిస్తున్నట్టు ఈడీ గుర్తించింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు యూఏఈ ఎమిరేట్స్‌ను అప్రమత్తం చేసింది. గగనతలంలో ఎక్కడ ఎగిరినా గుర్తించే విధంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రాడార్‌లోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ ‘ఎన్ 935 హెచ్ హాకర్ 800ఏ’ రాకపోకలపై నిఘా పెట్టింది. ఈ నెల 5న మెడికల్ ఎయిర్ అంబులెన్స్‌గా దుబాయ్‌కి వెళ్లినట్టు గుర్తించింది.
తిరిగి శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావడంతో..ఈడీకి సమాచారం అందించారు. దీంతో 8 మంది సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నది ఎయిర్ క్రాఫ్ట్‌లో తనిఖీలు చేసింది. అమర్‌దీప్‌కుమార్ గురించి ఆరా తీసింది. అతని జాడ లభించలేదు. ‘హాకర్ 800ఏ జెట్(ఎన్935హెచ్) ఎయిర్ అంబులెన్స్‌గా మాత్రమే హైదరాబాద్ వచ్చినట్టు గుర్తించారు. ఎయిర్ క్రాఫ్ట్‌ను సీజ్ చేశారు.
ఇదీ ఫాల్కన్ పోంజీ స్కీమ్ స్కామ్
హైటెక్ సిటీ హుడా ఎన్‌క్లేవ్‌లో 2020లో ఫాల్కన్ (క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ ప్రారంభం అయ్యింది. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ తదితర సంస్థలతో తమకు సంబంధాలు ఉన్నాయంటూ నకిలీ ఒప్పంద పత్రాలను విస్తృతంగా ప్రచారం చేశారు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో 3 స్కీమ్స్‌ను ఆఫర్ చేశారు. 145 రోజుల స్కీమ్‌లో చేరితే 11శాతం నుంచి12 శాతం వడ్డీ, 90 రోజుల స్కీమ్‌లో చేరితే 16 నుంచి- 18 శాతం వడ్డీ, 180 రోజులు అంతకంటే ఎక్కువ రోజులున్న ఇన్వాయిస్ ప్లాన్‌లో చేరితే 20- శాతం నుంచి 21.95 శాతం వడ్డీ రేటు చెల్లిస్తామని ప్రకటనలు ఇచ్చారు.
రూ.25 వేల నుంచి రూ.9 లక్షల వరకు టారిఫ్ ఇచ్చారు. 2021 నుంచి డిపాజిట్లు సేకరించారు. పెట్టుబడులు పెట్టిన వారికి వడ్డీతో కలిపి మొత్తం చెల్లించేవారు. ఇలా లబ్ధిపొందిన డిపాజిటర్ల నుంచే రెట్టింపు పెట్టుబడులు పెట్టించే వారు. ఇలా దేశవ్యాప్తంగా 6,979 మంది నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేశారు. రూ.850 కోట్లు తిరిగి చెల్లించారు. మరోరూ.850 కోట్లు మోసం చేశారు.