బీడీ కార్మికుల ఓట్లపై నజర్ .. ఓట్లేసే పరిస్థితిలో కార్మికులు ఉన్నారా అన్న అనుమానాలు

  • టేకేదార్ల ద్వారా వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల పాట్లు
  • ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 78 లక్షల మంది కార్మికులు
  • వారి సంఖ్యను బట్టి భారీగా నజరానాలు

నిర్మల్, వెలుగు : ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సుమారు 7 లక్షలకు పైగా ఉన్న బీడీ కార్మికుల ఓట్లపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కన్నేశాయి. ప్రతి నియోజకవర్గంలో 50 వేలకు తగ్గకుండా బీడీ కార్మికులు ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఎత్తులకుపై ఎత్తులు వేస్తున్నారు. సాధారణంగా బీడీ కార్మికుల ఓట్లన్నీ వన్​సైడ్  గంపగుత్తగా పడుతుంటాయని ప్రచారం ఉంది. దీంతో బీడీ కంపెనీల టేకేదారులకు పెద్దమొత్తంలో ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా కార్మికుల ఓట్లను కొల్లగొట్టేందుకు అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. 
 
టేకేదార్లతో ఒప్పందాలు.. 

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్  జిల్లాల్లో సుమారు 7 లక్షలకు పైగా పీఎఫ్, నాన్ పీఎఫ్  బీడీ కార్మికులు ఉన్నారు. నిర్మల్, ముథోల్, బోథ్​, ఖానాపూర్, కామారెడ్డి, బోధన్, కరీంనగర్, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి, నిజామాబాద్, బాల్కొండ, ఆర్మూర్  తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో వారి ఓట్లే పార్టీ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. ఒక్కో సెంటర్​ పరిధిలో 60 నుంచి 100 దాకా బీడీ కార్మికులు పనిచేస్తుంటారు. ఒక్కో టేకేదార్  కింద ఒకటి నుంచి మూడు, నాలుగు దాకా సెంటర్లు ఉంటాయి. దీంతో ప్రధాన పార్టీల లీడర్లు ఆయా టేకేదార్లను లోబరుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కార్మికుల సంఖ్యను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా ఆఫర్​ చేస్తున్నారు.  

దాటవేత ధోరణిలో బీడీ కార్మికులు

బీడీ కార్మికులు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారన్న నమ్మకంతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఉత్తర తెలంగాణలోని చాలా గ్రామాల్లో ఇప్పటికే క్యాండిడేట్లు బీడీ కార్మికులతో మంతనాలు ముమ్మరం చేశారు. కానీ, గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి బీడీ కార్మికులు మాత్రం ఎవరికీ స్పష్టమైన హామీ ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు తమ వద్దకు వచ్చినప్పుడు వారిని తిరస్కరించకుండా తల ఊపుతూనే నిర్ణయాన్ని మాత్రం స్పష్టం చేయడం లేదు.

అయితే, మూడు పార్టీలకు చెందిన అభ్యర్థుల ప్రతినిధులు చెల్లించే నజరానాలపైనే బీడీ కార్మికుల మద్దతు ఆధారపడి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాగా, కొంతమంది బీడీ కార్మికులు మాత్రం ఇప్పటి వరకు తమ సమస్యలను పరిష్కరించలేదంటూ అభ్యర్థుల ప్రతినిధులపై మండిపడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, హామీలు నెరవేర్చిన తర్వాతే తమ వద్దకు రావాలని స్పష్టం చేస్తున్నారు. దీంతో బీడీ కార్మికులను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. మధ్యవర్తు లుగా టేకేదారులను రంగంలోకి దించి వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

మధ్యవర్తులుగా టేకేదారులు..

ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా పీఎఫ్  బీడీ కా ర్మికులు ఉండగా మరో రెండు లక్షల వరకు నాన్ పీఎఫ్ బీడీ కార్మికులు ఉన్నారు. అయితే పీఎఫ్, నాన్ పీఎఫ్ బీడీ కార్మికులు ప్రతి కంపెనీలో ఉండడంతో ఆ కంపెనీలకు సంబంధించిన టేకేదారులను అభ్యర్థులు రంగంలోకి దించుతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్  ఇప్పటికే టేకేదారులతో మొదటి దశ చర్చలు జరిపినట్లు సమాచారం.

వారితో బీఆర్ఎస్  అభ్యర్థులు ఆత్మీయ సమ్మేళనం పేరిట సమావేశాలు నిర్వహించి అందరికీ విందులు ఇచ్చారని, బహుమతులు కూడా అందజేశారని తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవలే టేకేదారులందరికీ నెలకు 2 వేల రూపాయల ఫించను ఇవ్వడంతో వారు తమకు అనుకూలంగా ఉంటారని బీఆర్ఎస్  అభ్యర్థులు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే టేకేదారులతో ఎలాగైనా బీడీ కార్మికులను ఒప్పించి వారి ఓట్లను పొందేందుకు బీఆర్ఎస్  నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వస్తే బీడీ కార్మికుల పెన్షన్లు రద్దుచేస్తారని అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే బీడీ కార్మికుల పెన్షన్  పెంచుతామని హామీ ఇస్తున్నారు.

మరోవైపు బీఆర్ఎస్  ప్రభుత్వం బీడీ కార్మికులకు అన్యాయం చేసిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే కార్మికులకు జీవన భృతితో పాటు కనీస వేతన చట్టం అమలు చేస్తామని, పనిదినాల పెంపుపై చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్, బీజేపీ నేతలు హామీ ఇస్తున్నారు. బీడీ కార్మికుల ఉపాధికి భరోసా ఇచ్చే జీఓ నంబర్ 41ని ఎలాగైనా అమలు చేయించేందుకు కృషి చేస్తామని ఈ పార్టీలు భరోసా ఇస్తున్నాయి.