కాంగ్రెస్​లో చేరిన బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

  • కొత్తగూడెం మున్సిపాలిటీలో అవిశ్వాస రాజకీయాలు
  • పదవి కాపాడుకునేందుకుచైర్​ పర్సన్​క్యాంప్​ పాలిటిక్స్​ 
  • గద్దెదింపేందుకు అసమ్మతి వర్గం పైఎత్తులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్​ఎస్​కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, పలువురు సీనియర్​ లీడర్లు బుధవారం కాంగ్రెస్​లో చేరారు. వైరాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్​ చౌదరి సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్​లో చేరిన వారిలో కొందరు మహిళాకౌన్సిలర్ల భర్తలు కూడా ఉండడంతో ఆ కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పినట్టేనని పార్టీ లీడర్లుఅంటున్నారు.

కొత్తగూడెం మున్సిపల్​ చైర్​ పర్సన్​ కాపు సీతాలక్ష్మిపై 22 మంది అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. అవిశ్వాసంపై ఓటింగ్​ నిర్వహించేందుకు ఈ నెల 19న స్పెషల్​ మీటింగ్​ఏర్పాటు చేశారు. మరో నాలుగు రోజుల్లో ​ మీటింగ్​ ఉండడంతో అసమ్మతి కౌన్సిలర్లను బుజ్జగించేందుకు సీతాలక్ష్మి వర్గం ప్రయత్నిస్తోంది. పార్టీ హైకమాండ్​దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా నాలుగురోజులుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కౌన్సిలర్లు, ముఖ్య లీడర్లతో ఫోన్​లో మంతనాలు చేస్తున్నారు.

సీతాలక్ష్మికి మద్దతిస్తున్న 10 మంది కౌన్సిలర్లను మంగళవారం క్యాంపునకు తరలించారు. దీంతో అవిశ్వాసం పెట్టిన బీఆర్​ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్​వైపు మొగ్గు చూపారు. కౌన్సిలర్లు లక్ష్మణ్​, అనిల్, బీఆర్​ఎస్​ లీడర్లు భీమా శ్రీధర్​, కాసుల వెంకట్​, రజాక్​, మాదా శ్రీరాములు, రావి రాంబాబు, దుర్గా ప్రసాద్​, మసూద్​, మోరే రమేశ్​ తదితరులు కాంగ్రెస్​లో చేరారు.