ఎలక్షన్​ సీజన్​..పెండింగ్​ పనులన్నీ ఫటాఫట్​..

ఎలక్షన్​ సీజన్​..పెండింగ్​ పనులన్నీ ఫటాఫట్​..
  • ఏడుపాయలకు రూ.100 కోట్లు
  • రామాయంపేట డివిజన్ ఏర్పాటుకు నోటిఫికేషన్​ 
  • ఏండ్ల నుంచి పట్టించుకోక.. ఇప్పుడు హై స్పీడ్​ 
  • ఎన్నికల నేపథ్యంలో బీఆర్​ఎస్​ పై వ్యతిరేకత తగ్గించుకునేందుకే అంటున్న విపక్షాలు

మెదక్​, వెలుగు: నియోజకవర్గాల్లో మొన్నటి వరకు ఎక్కడికక్కడే ఆగిపోయిన  పనులను బీఆర్​ఎస్​ లీడర్లు పట్టాలెక్కిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా బీఆర్​ఎస్​ హైకమాండ్ జాగ్రత్త పడుతోంది.   ఏండ్ల నుంచి ఆగుతూ సాగుతూ వచ్చిన పనులకు ఇప్పుడు ఫటాఫట్​  నిధులు, జీవోలు విడుదలవుతున్నాయి. దీంతో లీడర్లు శంకుస్థాపనలు,   ప్రారంభోత్సవాలతో పాటు.. పనిలో పనిగా పొలిటికల్​ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. మొన్నటి వరకూ నిధులే లేవన్న నేతలు ఇప్పుడు అభివృద్ధి పనుల్లో బిజీగా కనిపిస్తున్నారు. 

రామాయంపేట డివిజన్​ప్రక్రియ షురూ .. 

రామాయంపేట, నిజాంపేట, నార్సింగి, చిన్నశంకరంపేట మండలాలను కలిపి రామాయంపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేయాలనే డిమాండ్​ కొన్నేళ్లుగా ఉంది. గతంలో 183 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో మళ్లీ రెండో విడతలోనూ జేఏసీ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు నెలలపాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. బంద్​, ర్యాలీలు, పాదయాత్రలు ఇలా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. అయినా లీడర్లు, ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. కాగా ఎన్నికలు సమీపిస్తుండటంతో డివిజన్​ ప్రక్రియ మొదలైంది. గత నెలలో మెదక్​లో జరిగిన సభలో రామాయంపేట రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఆ వెంటనే  ప్రాథమిక నోటిఫికేషన్​ వచ్చింది. ఈ క్రమంలో ప్రజలకు నమ్మకం కలిగించేలా రామాయంపేటలో పంచాయతీ రాజ్​ సబ్​ డివిజన్​ ఆఫీస్​నూ ప్రారంభించారు. 

వెంట వెంటనే నిధుల జీఓలు 

ఇంటర్నల్​ రోడ్లు, డ్రైనేజీలు, తదితర మౌలిక వసతుల కల్పన కోసం మెదక్​ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, రామాయంపేట, నర్సాపూర్​, తూప్రాన్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, జిల్లాలోని 493 గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి మెదక్​ సభలో ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు కలిపి మొత్తం రూ.198 కోట్లు మంజూరు చేస్తూ ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

ALSO READ : కాంగ్రెస్ లీడర్ల..హామీల వరద

అసంపూర్తి పనులు చకచకా...

జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో దాదాపు ఐదేండ్ల క్రితం పనులు షురు అయి   అసంపూర్తిగా ఉన్న రైతు బజార్​ నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టారు. అలాగే ఐదారేళ్లుగా అర్థంతరంగా ఆగిపోయిన గోసముద్రం - పిట్లం చెరువు మినీ ట్యాంక్​ బండ్​ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్తగా చేపట్టిన జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణం పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయి. 

ఏండ్ల నుంచి పెండింగ్​

జిల్లాలో ఏండ్ల నుంచి ఈ పనులను ప్రభుత్వం పట్టించుకోలేదని విపక్ష లీడర్లు అంటున్నారు. జనం ఆందోళనలు చేసినా బీఆర్​ఎస్​ లీడర్లు స్పందించలేదని, ఇప్పుడు ఎన్నికల టైంలో హడావుడిగా పనులు చేసిప్రజల దృష్టి మార్చేందుకే అని విపక్ష లీడర్ల విమర్శిస్తున్నారు. 

ఏడుపాయలకు రూ.100 కోట్లు

జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా చెబుతోంది. గతేడాది సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్​ ప్రారంభోత్సవం సందర్భంగా ఏడుపాయల అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. ఆ తర్వాత మంత్రి హరీశ్​ రావ్, ఎమ్మెల్సీ సుభాష్​​ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి ఇదే విషయాన్నిచెప్పారు. కానీ ఏడాది గడచినా నిధులు మంజూరు కాలేదు. కాగా గత నెల 23న మెదక్ ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ ఓపెనింగ్ సందర్భంగా జరిగిన సభలో సీఎం కేసీఆర్​ ఏడుపాయలకు రూ.100 కోట్లు మంజూరు చేస్తామని మరోమారు ప్రకటించారు. కానీ గతంలో లాగే ఈ సారి కూడా అది హామీకే పరిమితం అవుతుందనుకున్నారు. కాగా ఈనెల 12న ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ అయ్యింది.