హెచ్​సీయూలో విచ్చలవిడిగా విధ్వంసం : దాసోజు శ్రవణ్

హెచ్​సీయూలో విచ్చలవిడిగా విధ్వంసం : దాసోజు శ్రవణ్

న్యూఢిల్లీ, వెలుగు: హెచ్​సీయూలో సీఎం రేవంత్​ విచ్చలవిడిగా విధ్వంసా నికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్​ ఆరోపించారు. హెచ్‌సీయూ భూములను వేలం వేసి, సొమ్ము చేసుకోవాలని  కుట్ర పన్నుతున్నారని అన్నారు.  బుధవారం ఢిల్లీలో కంచ గచ్చిబౌలి భూములపై బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు తుంగ బాలు, స్వామి యాదవ్‌, హెచ్‌సీయూ విద్యార్థులతో కలిసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో మీడియాతో దాసోజు మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూమిని కాపాడుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు.  

రియల్‌ ఎస్టేట్‌ కోసం ప్రభుత్వం భూములను అమ్ముతున్నదని ఆరోపించారు. కవిుషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని సీఎంను విమర్శించారు. ఒక్క జింకను చంపితేనే బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కు  5 ఏండ్ల శిక్ష పడితే.. రేవంత్​కు ఎన్ని ఏండ్లు పడుతుందో అర్థం చేసుకోవాలి అని అన్నారు. కాగా, హెచ్‌సీయూ భూములతో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ మండిపడ్డారు.