- నెలకు రూ.అర కోటికి పైగా ఖర్చు చేస్తున్నా కనిపించని పారిశుధ్యం
- అధికారుల పర్యవేక్షణ లేకనే ఈ పరిస్థితి ఉందంటున్న కౌన్సిలర్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: శానిటేషన్ కోసం నెలకు రూ. అర కోటికి పైగా ఫండ్స్ ఖర్చు చేస్తున్నా కొత్తగూడెం పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తోంది. తడి, పొడి చెత్త సేకరణకు నిధులు కేటాయిస్తున్నా కనీసం 10 వార్డుల్లో కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియ జరగడం లేదు. చెత్త బుట్టల కొనుగోళ్లలో భారీగా నిధులు దుబారా చేశారని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. సిబ్బంది, వెహికల్స్ ఉన్నా జిల్లా కేంద్రంలో శానిటేషన్ సరిగా లేకపోవడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
నిధుల దుబారా..
కొత్తగూడెం పట్టణంలో 36 వార్డులుండగా, ప్రతీ వార్డుకు ఆటో ట్రాలీ, డ్రైవర్, ముగ్గురు సిబ్బందిని కేటాయించారు. మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగంలో 201 మంది ఉండగా, 175 మంది కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్నారు. పారిశుధ్య పనులను పర్యవేక్షించేందుకు 10 మంది సూపర్వైజర్లున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టు రెండేండ్లుగా ఖాళీగా ఉండడంతో, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. కొత్తగూడెం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రెండేండ్లుగా కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ఇదే అదనుగా భావించి మెరుగైన పారిశుధ్యం అంటూ పాలకులు, అధికారులు ఇష్టారాజ్యంగా నిధులను దుబారా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పట్టణ ప్రగతిలో భాగంగా రిలీజ్ అయిన నిధులతో వెహికల్స్ కొనుగోలు చేసినా వాటి నిర్వహణను పక్కన పెట్టారు. రెండేళ్ల కింద 43 ఆటో ట్రాలీలను రూ.2 కోట్లతో కొనుగోలు చేశారు. తడి, పొడి చెత్త సేకరణలో భాగంగా నాలుగేండ్ల కింద రూ. కోటి వెచ్చించి చెత్త బుట్టలు, డంపర్ బిన్స్ కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన చెత్త బుట్టలను పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. వీటిని ఎన్నికల సందర్భంగా వాడుకున్న దాఖలాలున్నాయి. డస్ట్‌బిన్స్, డంపర్‌బిన్స్ మాయమైనట్లు విమర్శలున్నాయి.
ఇంకొన్ని మున్సిపాలిటీ ఆవరణలో చెత్త కుప్పల్లో పడేశారు. అలాగే రూ.కోటితో ఐదు జోన్ల కోసం 5 ట్రాక్టర్లతో పాటు స్వీపింగ్ మిషిన్, డ్రైన్ క్లీనింగ్ మిషిన్, కాంపాక్టర్ వెహికల్ కొనుగోలు చేశారు. అయితే వీటిని సక్రమంగా ఉపయోగించడం లేదని పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక శానిటేషన్ విభాగంలో ఉపయోగించే వెహికల్స్ డీజిల్ వాడకంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. ఇదిలాఉంటే మరో రెండు ట్రాక్టర్లు, రెండు వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు రూ. 20లక్షలు కేటాయించారు.
శానిటేషన్ పై దృష్టి పెడతాం
కొత్తగూడెం పట్టణాన్ని క్లీన్‌గా ఉంచడమే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఇటీవలే కమిషనర్‌గా ఇక్కడకు బదిలీపై వచ్చాను. శానిటేషన్ విభాగంలో మార్పులు చేయాల్సి ఉంది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంలో కొత్తగూడెం పట్టణాన్ని క్లీన్‌గా మార్చుతాం. - రఘు, మున్సిపల్ కమిషనర్, కొత్తగూడెం
అధ్వానంగా పారిశుధ్యం..
పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చూడాలని పలుమార్లు కలెక్టర్ మున్సిపల్ ఆఫీసర్లను ఆదేశించినా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త కనిపిస్తోంది. శానిటేషన్ సిబ్బంది, సూపర్వైజర్లపై సరైనపర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందని అంటున్నారు. పారిశుధ్య కార్మికులతో పాటు అవసరమైన మెషిన్లు ఉన్నా
పారిశుధ్యం దయనీయంగా ఉందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా కొత్తగూడెంలో డెంగీ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.