ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకొని.. ప్రత్యేక విమానాలు కొనుగోలు చేసి.. వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నారని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాగజ్ నగర్ లో గురువారం (సెప్టెంబర్ 7న) బీఎస్పీ అధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. వంజరి పోలీస్ స్టేషన్ నుండి మొదలైన బైక్ ర్యాలీ పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకూ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రోడ్ షోను ఉద్దేశించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు రెండు సార్లు అధికారం ఇస్తే రాష్ట్ర సంపదను దోచుకొన్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్ భూములు ఎక్కడి నుండి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అక్రమంగా దోచుకొన్న డబ్బులతో ఎమ్మెల్సీ కవిత రూ.20 లక్షల వాచ్ చేతికి ధరిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఓట్లేస్తే ఆధిపత్య కులాలు గద్దెనెక్కి కూర్చొని.. పేదలపై పెత్తనం చెలాయిస్తున్నారో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. బుద్వేల్ లో పేదల అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా గుంజుకుని.. ప్రైవేటు కంపెనీకి వందల ఎకరాల భూములు కేటాయించిందని ఆరోపించారు.
ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన కోనేరు కోనప్ప అరాచకాలు సిర్పూర్ గడ్డపై పోవాలంటే వచ్చే ఎన్నికల్లో ఆయన్ను చిత్తు చిత్తుగా ఓడించాలని అన్నారు. సిర్పూర్ గడ్డపై జరిగే రాజకీయ పోరాటం బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కాదన్న ఆయన.. 30 ఆంధ్రా భూస్వామ్య కుటుంబాలకు 3 లక్షల మంది పేద ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంగా పేర్కొన్నారు. కోనప్ప కుటుంబం మాఫియా ఆగడాలను అరికట్టేందుకు బీఎస్పీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందన్నారు.
వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసమే కేసీఆర్ బీసీ బంధు, మైనారిటీ బంధు, దళిత బంధు, గృహలక్ష్మి వంటి పథకాలు ప్రవేశ పెట్టారన్నారని విమర్శించారు. కేసీఆర్ మాటలను నమ్మి ప్రజలు మళ్లీ మళ్లీ మోసపోవద్దన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. పేదల సొమ్మును పందికొక్కుల్లా తిన్న కొనప్పను ఓడించాలన్నారు. కోనప్ప రోజూ రెండు కోట్ల రూపాయల తెలంగాణ సంపదను దోచుకుని.. ఆంధ్రలో పెట్టుబడులుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన ఆంధ్ర, భూస్వామ్య కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి.. తిరిగి ఆంధ్రాకు పంపాలన్నారు. సిర్పూర్ ప్రాంతంలో ప్రజా సంపదనను దోచుకుంటున్న కోనేరు కోనప్ప, అతని అనుచరులపై పోలీసులు ఎందుకు పీడీ కేసులు నమోదు చేసి, జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు.