పేదల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది

నల్గొండ జిల్లా : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని, నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీ అఖిల మృతిచెందిన ఘటనే ఇందుకు నిదర్శనమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గత ఎనిమిదేళ్లుగా వైద్యఆరోగ్యశాఖను గాలికి వదిలేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ విధానాల వల్లే అఖిల మృతిచెందిందని, ఇది ప్రభుత్వం చేసిన హత్య అని అన్నారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం చెరువు అన్నారం గ్రామానికి వెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇటీవల నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన గర్భిణీ శిరస్సు అఖిల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అఖిల మృతికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

అఖిల కుటుంబానికి రూ.కోటి చెల్లించాలె

నార్మల్ డెలివరీ సాధ్యపడదని, సిజేరియన్ చేయమని అఖిల భర్త వైద్య సిబ్బందిని వేడుకున్నా వినలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సిజేరియన్ చేయాలంటే ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ వద్ద లెటర్ తీసుకురావాలని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. గర్భిణులకు నార్మల్ డెలివరీ ఎప్పుడు చేయాలి, సిజేరియన్ ఎప్పుడు చేయాలనే కనీస పరిజ్ఞానం వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, డాక్టర్లకు లేదా అని ప్రశ్నించారు. అఖిల మెడికల్ రికార్డులను తారుమారు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈనెల 9వ నుంచి 12వ తేదీ వరకు అఖిలకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చారో కేస్ షీట్ ద్వారా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిల కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

హరీష్ రావు మంత్రిగా అనర్హులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో తుప్పు పట్టిన సామాగ్రితో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి నలుగురు మహిళల ప్రాణాలు తీశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు బాధితుల కుటుంబ సభ్యులను ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదన్న ఆర్ఎస్ ప్రవీన్ కుమార్..రాష్ట్రానికి చెందిన డబ్బులను బీహార్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లోనూ పంచి వస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలను కాపాడలేని మంత్రి హరీష్ రావు.. వైద్య ఆరోగ్యశాఖలో కొనసాగేందుకు అనర్హుడు అన్నారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన తీసుకువస్తేనే.. నిరుపేదల ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడలేని ప్రభుత్వం అవసరం లేదన్నారు.