సీఎం కేసీఆర్ ​ లీడర్లను అరువు తెచ్చుకుంటుండు : ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్

దేవరకొండ, వెలుగు : రాష్ట్రంలోని బహుజన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు సీఎం కేసీఆర్ నార్త్​ఇండియా నుంచి కొందరు రాజకీయ నేతలను అరువు తెచ్చుకుంటున్నాడని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్​కుమార్ ఆరోపించారు. నల్గొండ జిల్లా దేవరకొండలోని ఫంక్షన్​హాల్​లో ఆదివారం నిర్వహించిన బీఎస్పీ మహిళా రాజకీయ చైతన్య సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కొంత మందిలా స్వప్రయోజనాల కోసం బహుజన ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టబోమని చెప్పారు. జనాభా పరంగా 99 శాతం ఉన్న బహుజనులకు అదే స్థాయిలో సంపదలో వాటా ఇవ్వాలని డిమాండ్ ​చేశారు. ప్రగతిభవన్​ను బహుజనుల పరం చేయడమే తమ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. 29 రోజులుగా సమ్మె చేస్తున్న జీపీ కార్మికుల సమస్యలపై చర్చించడానికి కేసీఆర్​కు తీరడం లేదని విమర్శించారు.

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే కేసీఆర్​పనైపోయిందన్నారు. ఎదుటి పార్టీల్లో చీలికలు తీసుకురావడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. జీఓ నంబర్ 46ను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించకపోవడం సిగ్గుచేటన్నారు. బీఎస్పీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని బెల్టుషాపులను పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం అనితారెడ్డి, అధికార ప్రతినిధి అరుణ క్వీన్, మహిళా కన్వీనర్​నిర్మల, దక్షిణ తెలంగాణ మహిళా కన్వీనర్ శైలజ, కవిత, ఎలిజెబెత్, లలిత, విజయ తదితరులు పాల్గొన్నారు.