అయిజ, వెలుగు : వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, పేదల భూములను బలవంతంగా లాక్కొని వాటిని బహుళజాతి కంపెనీలకు కేసీఆర్ప్రభుత్వం అప్పనంగా కట్టబెడుతోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇప్పటివరకు కంపెనీలకు అప్పజెప్పిన భూములపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు.. రూ.40 వేల కోట్ల పెట్టుబడితో కొంగర కలాన్ లో ఫాక్స్కాన్ కంపెనీకి శంకుస్థాపన చేసిన కేటీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు కేటాయిస్తారో చెప్పాలన్నారు. 9 ఏండ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా క్వశ్చన్ పేపర్లు లీక్ చేసిన కేసీఆర్ కుటుంబం వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు.
టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఈడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదనే భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రోద్బలంతోనే బీఎస్పీ అలంపూర్ నియోజకవర్గ నేత మధుగౌడ్ పై పోలీసులు దాడి చేసి, అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్ర 217 రోజు అయిజ పట్టణంతో పాటు మండలంలోని కుర్వపల్లి, గుడిదొడ్డి, జడదొడ్డి, తుంకుంట గ్రామాల్లో కొనసాగింది. యాత్రలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎంసీ కేశవరావు, అలంపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, మధు గౌడ్, స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు.