కాగజ్ నగర్, వెలుగు : రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతల సెల్ ఫోన్లను సర్కారు హ్యాక్చేయిస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో సామాన్యుల నుంచి లీడర్ల దాకా ఎవరి ఫోన్లకూ సేఫ్టీ లేదని, ముఖ్యంగా అపోజిషన్ లీడర్లు ధైర్యంగా సెల్ఫోన్వాడే పరిస్థితి లేదన్నారు. తన ఫోన్ కూడా హ్యాక్ అయిందని, స్వయంగా ఆపిల్ నుంచి మెయిల్వచ్చిందని, దీనిపై సుప్రీం కోర్టు సిట్టింగ్‌జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇది పిరికిపంద చర్య అని అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) నియోజక వర్గంలో చేపట్టబోయే పది రోజుల యాత్రను సోమవారం ప్రవీణ్‌కుమార్ కాగజ్‌నగర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని బీఆర్ ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు తమను ప్రశ్నించే నేతల ఫోన్లను ట్యాపింగ్, హ్యాకింగ్ చేయిస్తున్నాయన్నారు.
రాష్ట్ర సర్కారు కుంభకోణాల్లో మునిగిపోయింది
రాష్ట్ర సర్కారు కుంభకోణాల్లో మునిగిపోయిందని, మంత్రులు, ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ప్రవీణ్కుమార్ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గంలో లోకల్ ఎమ్మెల్యే కోనప్ప అండతో భూఆక్రమణలు జరుగుతున్నాయన్నారు. ధరణి పోర్టల్కబ్జాకోరుల కోసమే తెచ్చినట్లుందన్నారు.