మానవపాడు, శాంతినగర్, వెలుగు : కేసీఆర్ భూ దాహానికి పేదలు బలైపోతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుద్వేల్ అసైన్డ్ భూములు వేలం వేయడం దుర్మార్గమని, ఇప్పటికే 30 వేల ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నారని మండిపడ్డారు. శుక్రవారం గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వల్లూరు వడ్డేపల్లి మండలం శాంతినగర్లో జరిగిన బహుజన రాజ్యాధికార యాత్రలో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు.. కేసీఆర్ పదేండ్ల పాలనలో భూదాహం తీరడం లేదని, పేద రైతుల నోట్లో ప్రభుత్వం మట్టికొడ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుద్వేల్ లో సర్వే నెంబర్ 282, 299 లో 255 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం కుట్రపూరితంగా లాక్కుంటున్నదని ఆరోపించారు. అసైన్డ్ భూమి ఉంటే ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితాలో పెడ్తున్న ప్రభుత్వం, అవే భూములను వేలం వేసి ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ భూములను వేలంలో కొంటున్నవారు కేసీఆర్, కేటీఆర్ బినామీలేనని ఆరోపించారు. రాబోయే బహుజన రాజ్యంలో వేలం వేసిన అసైన్డ్ భూములతోపాటు కోకాపేటలో బీఆర్ఎస్ కు కేటాయించిన 13 ఎకరాలను స్వాధీనం చేసుకొని, తిరిగి పేద రైతులకు పంచుతామన్నారు. యాత్రలో జిల్లా ఇన్ చార్జి ఎంజీ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు కేశవరావు, నియోజకవర్గ అధ్యక్షుడు తిరుపాల్, జిల్లా మహిళా కన్వీనర్ శారద, నియోజకవర్గ కో కన్వీనర్ శోభా గౌడ్, ఇటిక్యాల అధ్యక్షుడు యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.