
బీఎస్పీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సందిగ్ధతకు తెరపడింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ప్రజల ఆశీర్వాదంతో.. బీసీ, మైనారిటీ, ముస్లింల సంక్షేమం కోసం సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని తెలిపారు. రామగుండం ఎన్టీపీసీలోని టీవీ గార్డెన్ లో బీఎస్పీ రామగుండం నియోజకవర్గ ఇన్ చార్జ్ గోలివాడ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఎస్పీలో చేరారు.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సింగరేణి నిధులను సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించాల్సిన కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. పేపర్ లీకేజ్ చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్ సీఎల్ ఉద్యోగాల కుంభకోణంలో నిరుద్యోగుల నుండి అధికార పార్టీ నాయకులు కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 150 ఇసుక లారీలు ఉన్నాయన్నారు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు.