ఇథనాల్ ప్రాజెక్టు రద్దయ్యే వరకూ పోరాడుతా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఇథనాల్ ప్రాజెక్టు రద్దయ్యే వరకూ పోరాడుతా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశీగామ గ్రామంలో నిర్మించబోయే ఇథనాల్ ప్రాజెక్టు స్థలాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఇథనాల్ ప్రాజెక్టు రద్దయ్యే వరకూ గ్రామస్తులకు అండగా ఉంటానని, అవసరమైతే జైలుకు కూడా వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. ఇథనాల్ ప్రాజెక్టు నిర్మించడం వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, నీరు, గాలి కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాశీగామ గ్రామంలోకి ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తున్నారంటే పోలీసులు రాత్రికి రాత్రే గ్రామస్తులను అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం (జూన్ 15న) మంత్రి కేటీఆర్ సిద్ధిపేటకు వెళ్తున్నారని తెలిసి.. పోలీసులు ప్రతిపక్ష నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి.. కార్యక్రమాన్ని పూర్తి చేశారన్నారు. 

పాశీగామ గ్రామంలో నిర్మించాలనుకుంటున్న ఇథనాల్ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనో లేదంటే సిరిసిల్ల, సిద్ధిపేటలో పెట్టుకోండి.. ఇక్కడ ఎందుకు పెడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఇథనాల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ప్రాంతంలోని భూములను మాత్రమే ప్రభుత్వం లాక్కోలేదని, రాష్ట్రంలో చాలా చోట్ల పరిస్థితి ఇలానే ఉందని చెప్పారు. రాజక్కపల్లె గ్రామంలో అదనపు టీఎంసీ కోసం చేపట్టిన కాళేశ్వరం లింకు-2 నిర్మాణం కారణంగా బోర్ బ్లాస్టింగ్ లతో పగిలిన ఇండ్లను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.

ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. కేసీఆర్ ను గద్దె దించే ప్రయత్నంలో జర్నలిస్టులు కూడా ముందుండాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్యపాత్ర జర్నలిస్టులదని చెప్పారు. ప్రజల తెలంగాణ కావాల్సిన రాష్ట్రం కొందరి కుటుంబ పాలనలో బంది అయ్యిందని వ్యాఖ్యానించారు.