తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పది సంవత్సరాలు కేసీఆర్ కు అధికారం ఇస్తే వారి కుటుంబం మాత్రమే లాభ పడిందని బహుజన సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి అంబేద్కర్ మినీ స్టేడియంలో శనివారం బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరయ్యే ముందు ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బహుజనులను తాగుబోతులను చేసి.. అభివృద్ధిలో ఉన్న తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలపై కేసులు పెట్టి అణచి వేస్తున్నారని దుయ్యబట్టారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కోసం పది సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నా అతీగతీ లేదన్నారు. 

యాదగిరి గుట్టును డెవలప్ చేయగానే సరిపోయిందా.. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి దేవాలయాలను ఎందుకు డెవలప్ చేయరని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. గల్ఫ్ కార్మికులకు రూ.500 కోట్లతో గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని..  ఐదు రూపాయలు కూడా కేటాయించలేదన్నారు. ఒక్క శాతం ఉన్న దొరలు మళ్లీ రాజ్యాధికారం కావాలని హెలిక్యాప్టర్ లో తిరుగుతున్నారు... బహుజనులు వారిని తరిమికొట్టి రాజ్యాధికారం సాధించుకోవాలని పిలుపునిచ్చారు.


రాష్ట్రంలో 119 సీట్లలో పోటీ చేస్తున్నామని.. డబుల్ ఫిగర్లలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అమరవీరులలో 99 శాతం బహుజనులేనని.. సంపద అంతా ఒక్క శాతం వారికి చేరిందని చెప్పారు. ఎలక్షన్లు ప్రకటించే ముందు ప్రొసీడింగ్ లతో లోపాయి గారి ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలి చేసింది అంటే వారు ఎన్ని ఘోరాలు చేసి ఉంటారో అర్థమవుతోంది.

డబ్బుల పంపిణీ చేయడానికి వారి బంధువులైన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లకు పోలీస్ శాఖలు అధికారాలు ఇచ్చారని చెప్పారు. వారికి ఇష్టమైన కలెక్టర్లతో పాత తేదీలతో స్కీం డబ్బులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. బహుజనులు వారి మోసాలను గుర్తించారని... రాబోయేది బహుజనుల రాజ్యమేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జోష్యం చెప్పారు.