- ప్రజా సమస్యలపై పోరాడే వారినే ఎన్నుకోండి
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
శాంతినగర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో ఓటును అమ్ముకోవద్దని, ప్రజా సమస్యలపై పోరాడే వారినే ఎన్నుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లీడర్లు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారన్నారు. ఆర్డీఎస్ కెనాల్ పూర్తి చేయడంలో అధికార పార్టీ లీడర్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారని, ఎన్నో ఏండ్లుగా ఆర్డీఎస్ కు రావాల్సిన నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు.
తుంగభద్ర వరద నిర్వాసితులకు ఇప్పటి వరకూ ఇండ్లు కట్టించలేదని మండిపడ్డారు. వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలని ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో పనిచేసే దళిత నాయకులు బానిసత్వ రాజకీయాలు చేస్తున్నారన్నారు. తర్వాత భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సిద్దార్థ పూలే, రాష్ట్ర నాయకులు పసుపుల బాలస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందికంటి విజయ్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు తిరుపాల్, నియోజకవర్గ ఇన్చార్జిలు మధు గౌడ్, కనకం బాబు, మహిళా నాయకురాలు నాగ జ్యోతి, రాజోలి మండల అధ్యక్షుడు వెంకటేశ్, ఉండవెల్లి మండల అధ్యక్షుడు ప్రభుదాస్, శాంతికుమార్, అయ్యన్న నాగరాజు, సురేశ్, వడ్డేపల్లి మండల నాయకులు మహేందర్, సురేందర్ పాల్గొన్నారు.