మునుగోడులో ఆర్ఎస్ ప్రవీణ్ ప్రచారం

చౌటుప్పల్, వెలుగు: మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ లీడర్లు జబర్దస్త్​ కామెడీ చేస్తున్నారని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఆదివారం చౌటుప్పల్ మండలంలోని చిన్నకొండూర్ లో గ్యాస్ ధరల పెరుగుదలపై నిరసన తెలుపుతున్న బీఎస్పీ కార్యకర్తలు, గ్రామస్తులపై బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అనుచరులు, కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు. ఓటమి భయంతోనే బీజేపీ దాడులకు దిగుతోందన్నారు. భయపడేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ లో ఆదివారం రాత్రి  జరిగిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆందోళ్ మైసమ్మ దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ దండు మల్కాపురం, కైతాపురం, లక్కారం, సుందరయ్య కాలనీ, హనుమాన్ నగర్ లతో పాటు పలు ఏరియాల్లో కొనసాగి బస్ స్టాండ్ దగ్గర ముగిసింది.

అంతకుముందు హయత్ నగర్ లోని బంజారా కాలనీలో వలస వచ్చి ఉంటున్న నారాయణపురం ప్రజలను కలిసి ప్రచారం చేశారు. తర్వాత పుట్టపాకలోని బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు చేశారు. ఆ పార్టీ అభ్యర్థి ఆందోజు శంకరాచారి, జిల్లా అధ్యక్షుడు పూదరి సైదులు, నియోజకవర్గ అధ్యక్షుడు పల్లె లింగస్వామి, రాష్ట్ర నాయకులు అనితా రెడ్డి, నిర్మల, కత్తుల పద్మ యాదవ్, పరమేశ్, కవిత, అంబేద్కర్, అర్జున్, శ్రీహరి చారి పాల్గొన్నారు.