కేసీఆర్.. తెలంగాణ మీ అయ్య జాగీరేం కాదు :  ఆర్ఎస్ ప్రవీణ్

  • బీఎస్పీ జెండా గద్దెలను కూల్చితే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం
  • ఢిల్లీలో కేసీఆర్​ తల కొట్టుకుంటున్నాడు 
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

మానకొండూర్, తిమ్మాపూర్, వెలుగు : బీఎస్పీ జెండాలను కూల్చి తమను బెదిరించాలని చూస్తే తమ సైన్యం చూస్తూ ఊరుకోదని, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 146వ రోజు మానకొండూర్ మండలంలోని ఊటూరు, పచ్చునూరు, లక్ష్మీపూర్, రంగపేట, అన్నారం, లలితాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్​..బీఆర్​ఎస్​పేరుతో ఢిల్లీకి పారిపోయాడని, అక్కడ ఆయన్ని  ఎవరూ పట్టించుకోకపోవడంతో తల కొట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. పాదయాత్ర సందర్భంగా మానకొండూరులో పార్టీ జెండా గద్దెను కూల్చారన్న విషయం తెలుసుకున్న ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించారు.

బెజ్జంకి మండలంలోని తోటపల్లి, కన్నాపూర్​ గ్రామాల్లో కూడా గద్దెలను కూల్చారని, ఇలాగే చేస్తూ పోతే రాబోయే కాలంలో గడీలు, ఫార్మ్ హౌస్ లను వదిలి పెట్టకుండా రెట్టింపు  ధ్వంసం చేస్తామన్నారు. తెలంగాణ మీ అయ్య జాగీరేం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రెండు సార్లు గెలిచినా నియోజకవర్గం ప్రజలకు చేసిందేమీ లేదని, ఇసుక దందా చేస్తూ ఆస్తులను కూడబెట్టుకుంటున్నాడన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిస్తున్నారని, ఆయన ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రామచంద్రం,రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ క్వీన్,రాష్ట్ర మహిళా కన్వీనర్ శిరీష, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ఇన్​చార్జి మాతంగి అశోక్, నియోజకవర్గ అధ్యక్షుడు ప్రభాకర్, మహిళా నాయకురాలు సుమలత  పాల్గొన్నారు.