
హైదరాబాద్, వెలుగు: ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, ఆధిపత్య కుల పార్టీల్లో జెండాలు మోసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు వెంటనే పదవులకు రాజీనామా చేసి బీఎస్పీలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గుండాల మదన్ కుమార్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. బుధవారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ప్రవీణ్ మాట్లాడారు. ఆధిపత్య పార్టీలు తమ ఎజెండాతో బహుజనులకు సంక్షేమ పథకాలిచ్చి వారిని కేవలం ఓట్లు వేసేవారుగా చూస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం కంటే బలంగా బహుజన ఉద్యమం వస్తుందని చెప్పారు. ఈ ఉద్యమ ప్రళయం దొరల గడీలను కూల్చుతుందన్నారు.