బీఆర్ఎస్ నేతల గడీల పాలనను బద్దలు కొట్టాలని రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు చెప్పే బూటకపు మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను ఆయన కోరారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన బీఎస్పీ బహుజన రాజ్యాధికార బహిరంగ సభ, నాగర్కర్నూల్ పట్టణంలోని జడ్పీ గ్రౌండ్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు.
ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో సీఎం కేసీఆర్ రూ.లక్షల కోట్లు దండుకున్నారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో గద్దెనెక్కిన కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి కూడా వాటి అమలుపై దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ‘‘ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు హెలికాప్టర్ లో తిరుగుతూ ప్రభుత్వ భూములు, పేదల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే చేసి కబ్జా చేసే యత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ధనబలం, జనబలం, అహంకారం, ఆశయం, కొండచిలువ, చలి చీమల మధ్య పోరాటం జరుగుతోంది. అంతిమంగా జనబలం, ఆశయం, చలిచీమల పట్టుదల గెలవాలి. బార్డర్ లో ఉన్న అలంపూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని జోగుళాంబ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పాడు.
ఆంధ్రా పాలకుల జలదోపిడీ వల్ల నష్టపోయిన సిర్పూర్ గడ్డ మీద నుంచి నేను పోటీ చేస్తున్నా అలంపూర్, సిర్పూర్ నియోజకవర్గాలు బీఎస్పీకి రెండు కళ్లలాంటివి” అని ఆర్ఎస్ పేర్కొన్నారు. అలంపూర్ నియోజకవర్గానికి సాగునీరు అందించే ఆర్డీఎస్ ను ప్రక్షాళన చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని ఆయన విమర్శించారు. అలాగే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పరిధిలో జూలకల్లు, మల్లమ్మకుంట, వల్లూరు రిజర్వాయర్లు నిర్మిస్తామని చెప్పి ఐదేండ్లు గడిచినా తట్టెడు మట్టి తీయలేదని ఫైర్ అయ్యారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆర్డీఎస్ రైతులు గోసపడినా పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీఎస్పీ క్యాండిడేట్లను గెలిపించాలని ఆయన కోరారు.