ఛార్జ్షీట్లో పేరున్నా కవితను అరెస్ట్ చేస్తలేరు : ఆర్ఎస్ ప్రవీణ్

జగిత్యాల : బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అందుకే లిక్కర్ స్కాం కేసు ఛార్జ్ షీట్ లో కవిత పేరు ఉన్నా ఆమెను అరెస్టు చేయడం లేదని అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా కొడిమ్యాల మండలం నాచుపల్లి, తిరుమలాపూర్, కోనాపూర్, సూరంపేట గ్రామాల్లో ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చే సంగతేమో గానీ అది సచ్చేదిన్ మాత్రం వస్తుందని ప్రవీణ్ కుమార్ సటైర్ వేశారు. 

రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు 50శాతానికి పెంచడంతో పాటు రూ. 5వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రజలు పప్పన్నానికి నోచుకోని పరిస్థితిలో ఉంటే.. కేసీఆర్ 17 రకాల వంటకాలతో పక్క రాష్ట్ర నాయకులకు విందు ఏర్పాటు చేస్తున్నాడని మండిపడ్డారు. ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నాయకులు పేదల భూములు కొల్లగొడుతున్నారని ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు పంజాబ్ రైతులను పరామర్శించేందుకు టైం ఉంది కానీ కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను పలకరించే తీరిక లేదా అని ప్రశ్నించారు.